విశాఖలో ఎన్నడూ చూడని సందడి కనిపిస్తోంది. ఇది రాజకీయ సందడి. విశాఖలో ఈ నెల 9న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రెండోసారి ప్రమాణం చేస్తారు అన్నది చాలా కాలంగా ఆ పార్టీ చెబుతూ వస్తోంది. జగన్ కూడా ఎన్నికల సభలలో ఇదే విషయం చెప్పారు. పోలింగ్ ముగిసిన తరువాత ముహూర్తం కూడా పెట్టేసారు.
విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలోని విశాలమైన ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్ వేలాది మంది జనాల సమక్షంలో సీఎం గా ప్రమాణం చేస్తారు అని అంటున్నారు. ఈ సభ ఏర్పాట్లను పార్టీ పరంగా నేతలు చూస్తున్నారు.
విశాఖకు చేరుకోవడానికి ఏపీలోని నలుమూలల నుంచి వైసీపీ నేతలు సిద్ధం అవుతున్నారు. విశాఖలో ఈ నెల 7 నుంచి తొమ్మిదవ తేదీ వరకూ మూడు రోజుల పాటు హోటళ్ళు అన్నీ అడ్వాన్స్ గా బుక్ అయిపోయాయి. రిసార్ట్స్ తో పాటు విడిది చేసేందుకు వీలైన ప్రాంతాలు అన్నీ కూడా ముందే బుక్ చేసేసారు. ఆ రోజున విశాఖకు వచ్చే విమానాలలో కూడా టికెట్లు బుక్ చేసేసుకున్నారు అని అంటున్నారు.
దాంతో విశాఖ జూన్ మొదటి వారం అంతా వైసీపీ నేతల పేరిట బుక్ అయిపోయింది. ఈసారి కూడా తామే విజయం సాధిస్తామని వైసీపీ చాలా నమ్మకంగా ఉంది. అత్యధిక సీట్లను సాధిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి వంటి వారు చెబుతున్నారు.
వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని వారు అంటున్నారు. విశాఖ నుంచే జగన్ పాలన ప్రారభిస్తారు అని వారు అంటున్నారు. ఫలితాలు రాకముందే ఒక సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టి వేదికలను సిద్ధం చేయడం, ముందస్తుగా హొటళ్ళను బుక్ చేయడం వంటివి గతంలో ఎపుడూ జరగలేదు. ఇది పక్కా మైండ్ గేం అని టీడీపీ అంటోంది.
వైసీపీ మాత్రం తాము ఆత్మ విశ్వాసంతో చెబుతున్న మాట అంటోంది. జూన్ 4 తరువాత జూన్ 9 వస్తుంది అని ఎవరేమిటి అన్నది రిజల్ట్ తోనే తెలుస్తుంది అని విపక్షాలు అంటున్నాయి. మీ కలలకు కూడా జూన్ 4 తో డెడ్ లైన్ పడుతుందని వైసీపీ నేతలు కౌంటరిస్తున్నారు. ఈ విషయాల సంగతి ఎలా ఉన్నా విశాఖలో ఎన్నడూ లేని రాజకీయ సందడి మాత్రం కనిపిస్తోంది.