ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాల్సిందేనా!

కాలం ఎంతలా జారిపోతుందో ఉమ్మడి ఏపీ విభజన అనంతరం ఒక దశాబ్దాన్ని చూస్తే అర్ధం అవుతుంది. ఆనాడు పదేళ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా చేశారు. ఆ గడువు…

కాలం ఎంతలా జారిపోతుందో ఉమ్మడి ఏపీ విభజన అనంతరం ఒక దశాబ్దాన్ని చూస్తే అర్ధం అవుతుంది. ఆనాడు పదేళ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా చేశారు. ఆ గడువు చూస్తే 2024 జూన్ 1 కి ముగుస్తోంది.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరిగాయి. రిజల్ట్ జూన్ 4కి వస్తుంది. కొత్త ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుంది అన్నది తెలియదు. ఈ లోగా పుణ్య కాలం ముగుస్తోంది. దాంతో ఏపీకి చెందిన కొన్ని సంస్థలు ఇప్పుడు ఏపీకి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపధ్యంలో జై భారత్ నేషనల్ పర్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ ఒక సూచన చేశారు.

రాష్ట్రపతి జోక్యం చేసుకుని మరో పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కొనసాగించాలని ఆయన కోరారు. ఏపీకి రాజధాని ఇంకా లేదు అని ఆయన గుర్తు చేశారు. అందువల్ల హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం అనివార్యం అని ఆయన అన్నారు.

గతంలో 2014లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దశాబ్దం పాటు హైదరాబాద్ ని కామన్ క్యాపిటల్ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇపుడు అలాంటి గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి చేయాల్సి ఉంది. అయితే ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కొనసాగించాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు.

ఒకవేళ కొత్త ప్రభుత్వం కోరుకుంటే ఆ మేరకు రాష్ట్రపతికి కేంద్రానికి వినతి చేస్తే దాని ప్రకారం నిర్ణయం జరిగే వీలు ఉంది. అయితే వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖ చంద్రబాబు సీఎం అయితే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి ఈసరికే నిర్ణయించారు. దాంతో ఉమ్మడి క్యాపిటల్ అన్న చర్చ ఉంటుందా అన్నది చూడాలి. మేధావులు అయితే ఏపీకి రాజధాని ఉండాలని ఎన్నాళ్ళు హైదరాబాద్ మీద ఆధారపడతామని ప్రశ్న లేవనెత్తుతున్నారు.