విజయసాయిని విశాఖ పిలుస్తోంది!

వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి సొంత జిల్లా నెల్లూరు. ఆయన ఎంపీగా ఉండేది ఢిల్లీలో. మధ్యలో విశాఖ వచ్చారు. కొన్నేళ్ల పాటు పార్టీ వ్యవహారాలు చూశారు. మూడేళ్ల క్రితం ఆ బాధ్యతలు కూడా వీడిపోయాయి.…

వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి సొంత జిల్లా నెల్లూరు. ఆయన ఎంపీగా ఉండేది ఢిల్లీలో. మధ్యలో విశాఖ వచ్చారు. కొన్నేళ్ల పాటు పార్టీ వ్యవహారాలు చూశారు. మూడేళ్ల క్రితం ఆ బాధ్యతలు కూడా వీడిపోయాయి. తాజాగా నెల్లూరు లోక్ సభకు పోటీ చేసి ఓటమి చెందిన విజయసాయిరెడ్డి ఇక ఢిల్లీలోనే ఉంటారు అని అంతా అనుకుంటున్న వేళ విశాఖలో ఆయన మెరిసారు.

దేవాదాయ శాఖలో పనిచేసే శాంతి అనే మహిళా అధికారిణితో తనకు సంబంధం అంటగట్టి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తన ఇమేజ్ ని భ్రష్టు పట్టించే పనిని చేయడం పట్ల విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. అదే విశాఖలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎవరినీ వదలకుండా చెడుగుడు ఆడేశారు.

తాను తప్పు చేయలేదని తన మీద తప్పుడు ఆరోపణలు చేసిన వారి మీద పరువు నష్టం దావా వేస్తాను అని హెచ్చరించారు. వైసీపీలోని వారి మీద ఆయన మండిపడ్డారు. తన మీద సొంత పార్టీ వారూ ఫిర్యాదులు గతంలో చేశారు అని గుర్తు చేసుకున్నారు.

విశాఖ భూ దందా అంటూ తన పేరుని లాగడం పట్ల విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాను కబ్జాలు చేశానని అంటున్న భూములు ఏవైనా ఉంటే తీసేసుకోవచ్చు అని స్పష్టం చేశారు. తాను ఏ అవినీతికీ పాల్పడలేదని అందుకే ధైర్యంగా మీడియా ముందుకు వచ్చాను అని అంటున్నారు.

విశాఖతో రాజకీయంగా ఎంతో బంధం పెనవేసుకున్న విజయసాయిరెడ్డికి ఇది తొలి పిలుపు కాదని అంటున్నారు. ఆయన మీద మరిన్ని ఆరోపణలను కూటమి నేతలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆయన మళ్ళీ మళ్లీ విశాఖ రావాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే తాను ఎవరికీ భయపడనని విశాఖకు మేలే చేశాను అని సాయిరెడ్డి అంటున్నారు.  

విశాఖ నుంచి గతంలో ఎంతో మంది ఎంపీలు గెలిచారు కానీ వారికి విశాఖ మళ్లీ రావాల్సిన అవసరం పడలేదు. విజయసాయిరెడ్డి ఎంపీ కాకపోయినా విశాఖలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడంతో ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. దాంతో విశాఖ టూ ఢిల్లీ షటిల్ సర్వీస్ ఆయన చేయాల్సిందేనా అని అంటున్నారు.

2 Replies to “విజయసాయిని విశాఖ పిలుస్తోంది!”

Comments are closed.