46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న రత్న భాండాగారం

12వ శతాబ్దానికి చెందిన పూరి జగన్నాధుడి ఆలయంలో ఓ పురాతన భాండాగారం ఉంది. అందులో అత్యంత విలువైన ఆభరణాలు, వజ్రాలున్నాయి. అయితే దాన్ని తెరిచి 46 సంవత్సరాలైంది. మళ్లీ ఇన్నేళ్లకు ఆ పురాతన ఖరీదైన…

12వ శతాబ్దానికి చెందిన పూరి జగన్నాధుడి ఆలయంలో ఓ పురాతన భాండాగారం ఉంది. అందులో అత్యంత విలువైన ఆభరణాలు, వజ్రాలున్నాయి. అయితే దాన్ని తెరిచి 46 సంవత్సరాలైంది. మళ్లీ ఇన్నేళ్లకు ఆ పురాతన ఖరీదైన రత్న భాండాగారాన్ని తెరిచారు. ఇంతకీ ఎందుకు..?

గత ఎన్నికల్లో ఒడిస్సాలో రాజకీయం చాలామటుకు ఈ భాండాగారం చుట్టూనే తిరిగింది. దీనికి కారణం ఈ ఖజానాకు చెందిన కొన్ని తాళం చెవులు మిస్సయ్యాయి. వాటిని ఎవరు అపహరించారు, అవి ఎలా మిస్సయ్యాయి, మిస్సయిన తాళం చెవులతో ఎలాంటి ప్రమాదం ఉందనే అంశాన్ని బీజేపీ బలంగా లేవనెత్తింది.

అంతేకాదు.. తాము అధికారంలోకి వస్తే, రత్న భాండాగారంలో ఉన్న విలువైన సంపదకు ఆడిటింగ్ చేస్తామని, దేవదేవుని ఆస్తుల వివరాల్ని బాహ్య ప్రపంచానికి వెల్లడిస్తామని, భాండాగారానికి మరమ్మతులు కూడా చేస్తామని తెలిపింది. ఇప్పుడదే జరిగింది.

46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ పురాతన ఖజానా తెరుచుకుంది. దీని కోసం 11 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది ప్రభుత్వం. ఇందులో గజపతి మహారాజుల ప్రతినిధికి కూడా చోటు కల్పించింది.

భాండాగారానికి చెందిన బాహ్య ఛాంబర్ కు 3 తాళాలున్నాయి. వాటికి సంబంధించిన ఒక తాళం చెవి గజపతి మహారాజు కుటుంబం దగ్గర, మరో తాళంచెవి జగన్నాధ్ ట్రస్ట్ దగ్గర, మరో తాళంచెవి స్వామికి సేవచేసే అర్చకుల సంఘం దగ్గర ఉంది. ఈ 3 తాళం చెవులతో వెలుపలి ఛాంబర్ ను తెరిచారు.

కానీ కీలకమైన లోపల ఛాంబర్ తాళం మాత్రం మిస్సయింది. దానికి ఇప్పుడు కొత్త లాక్ ఏర్పాటుచేయబోతున్నారు. అలా ఏర్పాటుచేసిన లాక్ కు సంబంధించిన తాళంచెవిని కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రెజరీలో ఉంచుతారు.

భాండాగారం తెరిచిన తర్వాత అందులోని విలువైన సంపదను ఏం చేస్తారు. దీని కోసం భారీ చెక్క పెట్టెల్ని సిద్ధం చేశారు. సంపద మొత్తాన్ని అందులోకి షిఫ్ట్ చేస్తారు. అదే టైమ్ లో సంపదను సభ్యుల బృందం రికార్డ్ చేస్తుంది. అన్ని ఆభరణాలతో లిస్ట్ తయారుచేస్తుంది.

అలా షిఫ్ట్ చేసిన చెక్క పెట్టల్ని, ఓ సురక్షిత ప్రాంతంలో ఉంచుతారు. గట్టి సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరాల మధ్య వాటిని కొన్ని రోజుల పాటు ఉంచుతారు. ఈలోగా భాండాగారానికి రిపేర్లు పూర్తిచేస్తారు. కొత్త లాక్స్ బిగిస్తారు. ఆ తర్వాత ఆభరణాల్ని, సభ్యుల బృందం సమక్షంలో తిరిగి భాండాగారానికి చేర్చి తాళం వేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత పూరి జగన్నాధుడి అసలైన ఆస్తులేంటి.. వాటి విలువ ఎంత అనే వివరాల్ని వెల్లడిస్తారు.