చెత్త అని అందరూ అసహ్యించుకుంటుంటారు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మాత్రం అందరిలా ఆయన చేయడం లేదు. చెత్తపై సంపద సృష్టించొచ్చని ఆయన ఆలోచిస్తున్నారు. చెత్తతో ఏటా రూ.2,643 కోట్ల ఆదాయం సృష్టించొచ్చని పవన్‌కల్యాణ్ అనడం చర్చనీయాంశమైంది.
తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయానికి తొలిసారిగా శుక్రవారం ఆయన వెళ్లారు. పవన్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ (ఎస్ఎల్ఆర్ఎమ్)పై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పవన్ తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జలం మనకు పూజ్యనీయమన్నారు. అది కలుషితం బారిన పడకుండా కాపాడుకోవాలని చెప్పారు.
ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం బాధగా వుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీల్లో డబ్బులు లేకుండా చేసిందని విమర్శించారు. చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్ఎల్ఆర్ఎమ్ను మొదట పిఠాపురం నుంచే ప్రారంభిస్తామన్నారు.
వేస్ట్ మేనేజ్మెంట్, పరిశుభ్రతను ప్రజలు బాధ్యతగా తీసుకోవాలని ఆయన అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించొచ్చని ఆయన చెప్పుకొచ్చారు. ఒక్కరోజులోనే పంచాయతీల దుస్థితిని మార్చలేమని, కొంత సమయం పడుతుందని ఆయన ముక్తాయింపు ఇవ్వడం గమనార్హం.