టీడీపీ నుంచి వైసీపీ నేర్చుకోవాల్సింది ఎంతో!

మంచి అనేది ఎక్క‌డున్నా నేర్చుకోవాల్సిందే. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల్లో మంచి విష‌యాలుంటే నేర్చుకోడానికి సిగ్గుప‌డాల్సిన అవ‌స‌రం ఎంత మాత్రం లేదు. వైసీపీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో, ఆ పార్టీ న‌డ‌వ‌డిక‌లో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా…

మంచి అనేది ఎక్క‌డున్నా నేర్చుకోవాల్సిందే. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల్లో మంచి విష‌యాలుంటే నేర్చుకోడానికి సిగ్గుప‌డాల్సిన అవ‌స‌రం ఎంత మాత్రం లేదు. వైసీపీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో, ఆ పార్టీ న‌డ‌వ‌డిక‌లో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంద‌ని చెప్పేవాళ్ల‌కు త‌క్కువేం లేదు. ప్ర‌ధానంగా టీడీపీ నుంచి ప‌బ్లిక్ రిలేష‌న్స్ (పీఆర్‌) ఎలా పెంపొందించుకోవాలో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. టీడీపీలో ఈ నెట్‌వ‌ర్క్ చాలా బ‌లంగా వుంది. వైసీపీలో లేనిది ఇదే. 

య‌ధారాజా త‌థాప్ర‌జా అనే సామెత చందానా… వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికే పీఆర్ ల‌క్ష‌ణాలు ఏ మాత్రం లేవు. ఇక జ‌గ‌న్ చుట్టూ ఉన్న‌వారికి వుంటాయ‌ని ఎలా అనుకుంటాం?  జ‌గ‌న్ త‌న చుట్టూ పెట్టుకున్న వారికి బాగా తెలిసిన విద్య ఏంటంటే.. త‌మ నాయకుడికి ఎవ‌రినీ ద‌గ్గ‌రకానివ్వ‌క‌పోవ‌డం. చివ‌రికి ఎలా త‌యారైందంటే… జ‌నానికి కూడా జ‌గ‌న్‌ను దూరం చేసేంత‌గా ఆయ‌న చుట్టూ ఉన్న కోట‌రీ విజ‌య‌వంతంగా చేయ‌గ‌లిగింది. 

కానీ జ‌గ‌న్‌కు ఇవేవీ తెలియ‌క.. అక్కాచెల్లెమ్మ‌ల‌ ఓట్లు, అవ్వాతాత‌ల ఓట్లు ఏమ‌య్యాయ్? అని జ‌గ‌న్ అమాయ‌కంగా అడగ‌డం గ‌మ‌నార్హం. సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధి క‌లిగించినంత మాత్రాన ప‌రిపోదని, వారితో క‌నెక్టివిటీ పోయినందునే ఓడిపోవాల్సి వ‌చ్చింద‌ని జ‌గ‌న్‌కు చెప్పేవాళ్లెవ‌రు?

ఇదే టీడీపీ విష‌యానికి వ‌స్తే… 2029 ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అవుతోంది. ముందుగా త‌మ‌కు వ్య‌తిరేక మీడియా, అలాగే నాయ‌కులెవ‌ర‌నే విష‌య‌మై ఆ పార్టీ ఆరా తీస్తోంది. ప్ర‌భావ‌శీలురైన నాయ‌కులు, జ‌ర్న‌లిస్టులు, ఇత‌ర‌త్రా వ్య‌క్తులు, సంస్థ‌ల‌తో స‌త్సంబంధాలు ఏర్ప‌ర‌చుకోడానికి టీడీపీ పీఆర్ నెట్‌వ‌ర్క్ చురుగ్గా ప‌ని చేస్తోంది. టీడీపీ విజ‌యంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న‌ది పీఆర్ వ్య‌వ‌స్థే అంటే అతిశ‌యోక్తి కాదు.

పబ్లిక్ రిలేష‌న్స్ గురించి జ‌గ‌న్‌కు, ఆయ‌న న‌మ్మ‌కంతో పెట్టుకున్న కోట‌రికీ ప‌ట్టింపే లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఒక రాజ‌కీయ పార్టీని బ‌ల‌మైన పౌర సంబంధాల వ్య‌వ‌స్థ లేకుండా న‌డిపించాల‌ని ఎలా అనుకుంటున్నారో వారికే తెలియాలి. జ‌గ‌న్ కోట‌రీ దృష్టిలో పీఆర్ అంటే, అధినేత నుంచి కోట్లాది రూపాయ‌లు డ‌బ్బు దండుకోవ‌డం, దాన్ని ఇద్ద‌రుముగ్గురు పంచుకోవ‌డం. తాను ఎంచుకున్న టీమ్ స‌రిగా ప‌ని చేస్తున్న‌దా? లేదా? అనే క్రాస్ చెక్ చేసుకునే అల‌వాటు వైఎస్ జ‌గ‌న్‌కు ఏ మాత్రం లేదు. 

టీడీపీలో ఇంత‌కాలం పీఆర్ వ్య‌వ‌స్థ‌ని చంద్ర‌బాబు ప‌ట్టించుకునే వారు. ఇప్పుడు ఆ వ్య‌వ‌హారాలు లోకేశ్ చూసుకుంటున్నారు. లోకేశ్ చుట్టూ అత్యంత బ‌లీయ‌మైన పీఆర్ వ్య‌వ‌స్థ వుంది. లోకేశ్‌కు ఏదైనా స‌మాచారాన్ని సెకెండ్ల‌లో చేర‌వేయ‌డం, ఆయ‌న చెప్పింది కూడా అంతే స‌మ‌యంలో తిరిగి పంప‌డంలో పీఆర్ వ్య‌వ‌స్థ చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తోంది. 

ఫ‌లానా వ్య‌క్తులు, వ్య‌వ‌స్థ‌ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని అనుకుంటే, వెంట‌నే సంబంధిత వ్య‌క్తుల‌తో నేరుగా మాట్లాడేందుకు లోకేశే రంగంలోకి దిగుతారు. దీనివ‌ల్ల టీడీపీకి వ్య‌తిరేకంగా ప‌ని చేయాల‌ని అనుకునే సంస్థ‌లు, లేదా వ్య‌క్తులు.. క‌నీసం వ్య‌తిరేకంగా ప‌ని చేయ‌ర‌నేది టీడీపీ ఎత్తుగ‌డ‌. రాజ‌కీయాల్లో వ్యూహ‌ప్ర‌తివ్యూహాలే అంతిమంగా ఏ పార్టీని అయినా విజేతగా నిలుపుతాయి. 2019లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ.. ఐదేళ్లు తిరిగే స‌రికి అధికారాన్ని ద‌క్కించుకునే స్థాయికి ఎద‌గ‌డం వెనుక ఆ పార్టీ పీఆర్ టీమ్ ఉంది. 

టీడీపీ విజ‌య ర‌హ‌స్యం ఇదే అని వైసీపీ ఎప్ప‌టికి తెలుసుకుంటుందో తెలియదు. జ‌గ‌న్ త‌న చుట్టూ నియ‌మించుకున్న కోట‌రీలోని పీఆర్ టీమ్‌కు, మ‌రెవ‌రినీ త‌మ నాయ‌కుడి ద‌గ్గ‌రికి రానివ్వ‌కుండా మాత్ర‌మే తెలుస‌ని ఆ పార్టీలో ఎవ‌రిని అడిగినా చెబుతున్నారు. కావున జ‌గ‌న్ మ‌ళ్లీ త‌న పార్టీకి పూర్వ వైభవం తెచ్చుకోవాల‌నే ఆలోచ‌న వుంటే, లోకేశ్ పీఆర్ టీమ్‌పై స్ట‌డీ చేస్తే స‌రిపోతుంది. కాదు, కూడ‌ద‌ని అనుకుంటే, అది వారిష్టం. బాగుప‌డాల‌ని అనుకున్న వాళ్లు ప్ర‌త్య‌ర్థుల్లోని మంచిని గ్ర‌హిస్తారు. త‌మ‌లోని చెడును త్య‌జిస్తారు.