ఇదేలా పాజిబుల్.. డౌటే!

జీవన్ టోన్ మందు తాగిన తరువాత.. తాగక ముందు అంటూ గతంలో ప్రకటనలు వచ్చేవి. ఆంధ్ర సీఎం చంద్రబాబు ఈ రోజు అమరావతి గురించి పవర్ పాయింట్ ప్లస్ వీడియో ప్రెజెంటేషన్ అలాగే వుంది.…

జీవన్ టోన్ మందు తాగిన తరువాత.. తాగక ముందు అంటూ గతంలో ప్రకటనలు వచ్చేవి. ఆంధ్ర సీఎం చంద్రబాబు ఈ రోజు అమరావతి గురించి పవర్ పాయింట్ ప్లస్ వీడియో ప్రెజెంటేషన్ అలాగే వుంది. 2019లో ఇలా వున్నాయి. 2024లో ఇలా అయిపోయాయి అంటూ వివిధ కట్టడాలను చూపించారు.

నిజమే. జగన్ కు అమరావతి గురించి పట్టలేదు. పట్టించుకోలేదు. అందువల్ల వాటిని ఎక్కడ ఎలా వున్నాయో అలాగే వదిలేసారు. చుట్టూ పిచ్చి తుప్పలు లేచిపోయాయి. అందులో అణుమాత్రం సందేహం లేదు.

కానీ 2019లో పెళ్లి కూతుళ్ల మాదిరి ముస్తాబై కళకళలాడుతూ, రెడీ టూ ఆక్యుపై అన్నట్లు వున్న భవనాలు, 2024 నాటకిి ఇంకా అండర్ కనస్ట్రక్షన్ లో వున్నట్లు మారిపోవడం ఏమిటి? ముందుకు వెళ్లకపోవచ్చు. కానీ వెనక్కు అయితే వెళ్లలేవు కదా. ఇక్కడ చిన్న మతలబు ఏమిటంటే, 2019 అంటూ చూపించినవి, ప్లానర్లు తయారు చేసిన టూడీ డిజైన్లు. పూర్తయ్యే సరికి ఎలా వుంటాయి అన్న వీడియోలు అన్నమాట.

వాటిని, వీటిని మిక్స్ చేసి, జగన్ వల్ల అమరావతి ఇంత వెనక్కు వెళ్లిపోయింది అనే భావన జనాలకు కలిగేలా ప్రయత్నించారు. అంతే కాదు, ఇలాంటి మెంటల్ మనిషి, ఇలాంటి తిక్కలోడు అంటూ జగన్ ను మరింత పలుచన చేసేలా మాట్లాడారు.

ఒక సీఎంనే మరో మాజీ సీఎంను ఇలా మెంటలోడు, తిక్కలోడు అని, కేస్ స్టడీ అంటూ మాట్లాడితే పార్టీ జనాలు మరి కాస్త ముందుకు వెళ్లి మాట్లాడుతాయి అన్న సంగతి చంద్రబాబు లాంటి సీనియర్ గుర్తించకపోతే ఎలా?

జగన్ అమరావతిని పట్టించుకోలేదు అన్నంత మాత్రాన మెంటలోడు, తిక్కలోడు అయిపోడు కదా. కొందరికి కొన్ని ఇంట్రస్ట్ లు వుంటాయి. చంద్రబాబుకు ఐటి లేదా అమరావతి ఇంట్రస్ట్ కావచ్చు. జగన్ కు సంక్షేమ పథకాలు ఇంట్రస్ట్ కావచ్చు. ఆ సంగతి మరిచిపోతే ఎలా?