రాహుల్ బేషరతు క్షమాపణ చెప్పాల్సిందే?

‘ఈ దేశంలో హిందువుగా చెప్పుకునే ప్రతి ఒక్కడు హింసను ప్రేరేపిస్తున్నారు’ అని అర్థం వచ్చేలాగా లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా వివాదాస్పదం అవుతున్నాయి. రాహుల్…

‘ఈ దేశంలో హిందువుగా చెప్పుకునే ప్రతి ఒక్కడు హింసను ప్రేరేపిస్తున్నారు’ అని అర్థం వచ్చేలాగా లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా వివాదాస్పదం అవుతున్నాయి. రాహుల్ గాంధీ నోటి దురుసుతనానికి ఆలోచనారహితమైన మాటలకు ఈ వ్యాఖ్యలు నిదర్శనం అని పలువురు  అంటున్నారు.

కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే కాదు తటస్తులు సామాన్యులు కూడా రాహుల్ దుందుడుకు వ్యాఖ్యల పట్ల అసహనం ఫీలవుతున్నారు. హిందువుగా చెప్పుకునే వ్యక్తులను కించపరిచేలాగా అవమానించేలాగా మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాహుల్ గాంధీ కి భారతీయ జనతా పార్టీ శత్రువు కావచ్చు.. భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఎజెండాతో చెలరేగుతూ ఉండవచ్చు. కానీ 150 కోట్ల జనాభా ఉన్న ఈ సువిశాల భారత దేశంలో హిందువు అయిన ప్రతి ఒక్కరూ బిజెపి సానుభూతిపరులు కార్యకర్తలు అయి ఉంటారనుకోవడం పిచ్చి భ్రమ. అదే నిజమైతే ఆ పార్టీ 240 స్థానాలకు పరిమితం అయ్యేది కాదు కదా, ఏకంగా ఒంటరిగా 500 సీట్లు సాధించగలిగేదేమో.

బిజెపిని ద్వేషించే హిందువులు ఏ దేశంలో లేరు అని చెప్పడం అవివేకమే అవుతుంది. బిజెపిని వ్యతిరేకించినంత మాత్రాన, వారు తమను తాము హిందువులుగా గుర్తించుకోకుండా బతకడం లేదు. హిందూ ధర్మం మౌలిక లక్షణాలు తెలిసినవారు తమను తాము సగర్వంగా హిందువుగానే ప్రకటించుకుంటారు. ఇప్పుడు రాహుల్ చేసిన దుడుకు వ్యాఖ్యల ఫలితంగా తాను హిందువులని చెప్పుకునే ప్రతి ఒక్కడు కూడా హింసను ప్రేరేపించే వ్యక్తి అనే అర్థం ధ్వనిస్తోంది.

రాహుల్ గాంధీ తన మాటలు వాడడంలో తేడా రావడం వల్ల.. భారతదేశపు ఆత్మను పరిహాసం చేసినట్లుగా ప్రజలు దీనిని భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మీద ఆయనకు దుగ్ధ ఉండవచ్చు. కానీ తాను చేసిన అర్థరహితమైన వ్యాఖ్యలకు ఆయన ఈ దేశపు హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ వినిపిస్తోంది.

తాను అన్నది ఆ పార్టీ నాయకులనే తప్ప దేశంలోని అందరు హిందువులను కాదని ఆయన సమర్థించుకోవచ్చు. కానీ.. అలాంటి సమర్థింపు వ్యాఖ్యలను గాయపడిన హిందూ సమాజం హర్షించదు. క్షమించదు. బిజెపిని నిందించాలనే తొందరపాటులో.. మతాన్ని నిందించడం అనేది మంచి పని కాదు. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటుందనే తేడా తెలియకుండా మాట్లాడితే ఇలాంటి చిక్కులే వస్తాయి.