ప్రతీ ఏడాదీ ఎన్టీవీ- భక్తిటీవీల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించే కోటి దీపోత్సవానికి సర్వం సిద్ధం అయ్యింది. వరసగా 14వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. భక్తి టీవీ- ఎన్టీవీ ఆధ్వర్యంలో 17 రోజుల పాటు కోటి దీపోత్సవం జరగనుంది. నవంబర్ తొమ్మిదో తేదీన మొదలు కానున్న ఈ శుభకార్యం 25వ తేదీ వరకూ భక్తి శ్రద్ధలతో కొనసాగనుంది.
ప్రవచనాలతో మొదలై, ప్రత్యేక అర్ఛనలు, దేవదేవుల కల్యాణ మహోత్సవాలు, నీరజనాలతో ఈ కోటి దీపోత్సవం భక్తులను పులకింపజేయనుంది. 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం 14వ సంవత్సరం శోభాయమానంగా జరగనుంది.
ఉత్సవ విగ్రహాల ఊరేగింపుతో కోటి దీపోత్సవం మహోజ్వల ఘట్టంగా సాగనుంది. కోటి దీపోత్సవంలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి వచ్చే ఉత్సవ విగ్రహాలకు పూజలు జరుగుతాయి. భక్త కోటిని పులకింపజేసే ఈ ఉత్సవం ప్రతి యేడాది లాగే ఈ సంవత్సరం కూడా జరగనుంది.
కోటి దీపోత్సవం అంటే కేవలం దీపాలను వెలిగించడం మాత్రమే కాకుండా కూర్చున్న చోటు నుంచే మహాదేవునికి జరిగే సహస్ర కలశాభిషేకాన్ని కనులారా వీక్షించవచ్చు. శివలింగానికి స్వయంగా రుద్రాక్షలు, భస్మంతో అభిషేకం చేసే అవకాశాన్ని కూడా నిర్వాహకులే కల్పిస్తున్నారు. కన్నుల పండువగా సాగే దేవతల కల్యాణాన్ని చేయించినా, వీక్షించినా మహా పుణ్యప్రదమని అంటారు. ఈ రెండు అదృష్టాలు భక్తి టీవీ కోటి దీపోత్సవంలో కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు.
అంతేగాక ఒకే వేదికపై శివకేశవులను కోటి దీపాల మధ్య దర్శించుకునే మహా యోగమే కోటి దీపోత్సవం. ప్రవచనామృతాలు, కళ్యాణ కమనీయాలు, వెలుగులీనే దీపాంతపులతో కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. నవంబర్ 9 నుండి మొదలై నవంబర్ 25 వరకూ ఈ ఉత్సవం జరగనుంది. ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఈ క్రతువు మొదలుకానుంది. దీనికి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం వేదిక కానుంది.