అయ్యో జేసీ.. ఆవేద‌న ప‌ట్ట‌ని ప్ర‌భుత్వం!

తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాకర్‌రెడ్డి ఆవేద‌న సొంత ప్ర‌భుత్వానికి ఏ మాత్రం ప‌ట్ట‌డం లేదు.

తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాకర్‌రెడ్డి ఆవేద‌న సొంత ప్ర‌భుత్వానికి ఏ మాత్రం ప‌ట్ట‌డం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం… జేసీ బ్ర‌ద‌ర్స్‌ను ప్ర‌భుత్వం క‌మెడియ‌న్స్‌గా చూడ‌డ‌మే అనే అభిప్రాయం లేక‌పోలేదు. నోటికొచ్చింద‌ల్లా మాట్లాడ్డం, ప‌ద్ధ‌తుల్ని పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిని కూట‌మి స‌ర్కార్ లైట్ తీసుకుంద‌ని టీడీపీ నాయ‌కులే అంటున్నారు.

ఐదు నెల‌ల క్రితం వైసీపీ నేత‌ల‌పై తానిచ్చిన ఫిర్యాదుపై ఇంత వ‌ర‌కూ అతీగ‌తీ లేక‌పోవ‌డంపై ఆయ‌న సీరియ‌స్‌గా ఉన్నారు. ఇలాగైతే సుప్రీంకోర్టు వ‌ర‌కైనా వెళ్తాన‌ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. అస‌లు పోలీసుల‌పై జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డానికి దారి తీసిన ప‌రిస్థితి గురించి తెలుసుకుందాం.

వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్‌రెడ్డిపై ర‌వాణాశాఖ అధికారుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు అరెస్ట్ చేశారు. క‌డ‌ప సెంట్ర‌ల్ జైల్లో నెల‌ల త‌ర‌బ‌డి తండ్రీకొడుకు వుండాల్సి వ‌చ్చింది. దీంతో ఆయ‌న వైసీపీపై క‌క్ష పెంచుకున్నారు. అధికారంలోకి రాగానే ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని స‌మ‌యం కోసం ఎదురు చూశారు.

ఐదు నెల‌ల క్రితం నాటి ర‌వాణాశాఖ మంత్రి పేర్ని నాని, తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అలాగే ర‌వాణాశాఖాధికారుల‌పై తాడిప‌త్రి ఒన్‌టౌన్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. త‌న‌పై త‌ప్పుడు ఫిర్యాదు, కేసు న‌మోదు చేశార‌ని జేసీ వాద‌న‌. అందుకే వాళ్ల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని మీడియా స‌మావేశం పెట్టి, మ‌రీ డిమాండ్ చేశారు.

అయితే జేసీ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి ముంద‌డుగు వేయ‌లేదు. ఇదే ఆయ‌న ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. ఐదు నెల‌ల‌వుతున్నా ఎఫ్ఆర్ఐ న‌మోదు చేయ‌క‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఇలాగైతే సుప్రీంకోర్టు వ‌ర‌కైనా న్యాయ‌పోరాటం చేస్తాన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఇప్ప‌టికైనా ఆయ‌న బెదిరింపుల‌కు ప్ర‌భుత్వం త‌లొగ్గుతుందేమో చూడాలి.

One Reply to “అయ్యో జేసీ.. ఆవేద‌న ప‌ట్ట‌ని ప్ర‌భుత్వం!”

Comments are closed.