జగన్ మంత్రివర్గంలో పదవులు పోయినవాళ్ళందరూ పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోపల బాధపడుతున్నారని, ఆవేదన చెందుతున్నారని చెప్పొచ్చు. రాజకీయ నాయకులు ఎలాంటి అవమానాలనైనా భరిస్తారుగానీ పదవులు పొతే మాత్రం యమ బాధపడిపోతారు. మరోలా చెప్పాలంటే పదవి పోయినందుకంటే కేబినెట్ మంత్రులైతే ఆ హోదా పోయినందుకు బాధపడతారు. కేబినెట్ హోదా అంటే కొన్ని సౌకర్యాలు ఉంటాయి.
అధికారం ఉంటుంది. ఒక దర్పం, రాజసం ఉంటాయి. సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని శక్తిహీనులైనా, ముఖమంత్రి చెప్పినట్లు ఆడే కీలుబొమ్మలే అయినా హోదా అనేది ఒకటి ఉంటుంది కదా. జగన్ కేబినెట్ లోనైనా, కేసీఆర్ కేబినెట్లోనైనా మంత్రులంతా ఇంతే. స్తోత్ర పాఠాలు చదవడం, భజన చేయడం తప్ప మరో పని ఉండదు. సరే … ఈ సంగతి పక్కన పెడితే మంత్రులందరినీ తీసేసి జగన్ హాయిగా ఉన్నాడా అంటే లేడని చెప్పొచ్చు. తీసేసిన వారిలో కొందరికి మళ్ళీ అవకాశం ఇస్తానని చెప్పడంతో అలా ఆశలు ఉన్న వారు జగన్ మీద వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు స్వామీజీల చుట్టూ, గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారట.
వాళ్ళ అనుచరులు, అభిమానులు పూజలు, యాగాలు, చండీ హోమాలు వంటివి చేయిస్తున్నారు. కొందరు మళ్ళీ తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పదవి పోయినందుకు అసంతృప్తిగా ఉన్న వారిని జగన్ కుడిభుజం సజ్జల రామకృష్ణ రెడ్డి బుజ్జగిస్తున్నాడు. బతిమాలుతున్నాడు. మంత్రి పదవి రాదని ఫిక్స్ అయినవారికి కేబినెట్ హోదా ఉండే పదవులు ఇస్తామని చెబుతున్నారు. ఆ హోదా ఉంటే చాలని కొందరు హ్యాపీగా ఫీలవుతున్నారు.
పలువురు సీనియర్లు, తొలిసారి ఎమ్మెల్యేలు కూడా తమ సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి దక్కపోతే మాత్రం పార్టీని వీడేందుకు సైతం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి పోయినవారికి పెదవులమీద ప్రేమ తప్ప జగన్ మీద లేదు. ప్రస్తుతం కేబినెట్ నుంచి తప్పించిన మంత్రులలో చాలా మంది సీఎం ముందు, బయట కూడా తాము హ్యాపీగా ఉన్నామని చెప్పుకుంటూనే అంతర్గతంగా మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు.
దీంతో తాజా కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా వారికి చోటు దక్కకపోతే ఎంతకైనా రెడీ అంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ మారేందుకు కూడా సై అంటున్నారు. అసలే ప్రతిపక్షాలు జగన్ సర్కార్ విషయంలో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకునేందుకు సిద్ధంగా లేవు. ఇలాంటి సమయంలో వీరిపై వల విసిరేందుకు విపక్షాలు సిద్ధమైపోతున్నాయి. గతమంతా మర్చిపోవడానికి అంటే అధికారంలో ఉన్నప్పుడు తిట్టిన తిట్లను, చేసిన అవమానాలను మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.
ప్రస్తుత కేబినెట్ ప్రక్షాళనలో అసంతృప్తుల్ని అధిగమించి సాఫీగా విస్తరణ చేయగలిగితే సీఎం జగన్ రాష్ట్ర రాజకీయాల్లో మరింత బలమైన నేతగా పేరు తెచ్చుకుంటారు. అలా కాకుండా మంత్రి పదవుల చిచ్చుతో పార్టీలో సీనియర్లు, కొత్త ఎమ్మెల్యేలు చేజారితే, విపక్షాల్లో చేరిపోతే మాత్రం కచ్చితంగా జగన్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
అన్నింటికంటే మించి మరో ఏడాది తర్వాత ఎలాగో ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. అప్పటికల్లా ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు విపక్షాల్లో చేరి చిచ్చు పెడితే మాత్రం వైసీపీకి కూడా రాజకీయంగా నష్టం తప్పదు. దాని స్ధాయి ఎక్కువగా ఉంటే వైసీపీకి మరోసారి ఙారీ మెజారిటీతో అధికారం దక్కించుకోవాలన్న కలపైనా ప్రభావం పడుతుంది. కాబట్టి జగన్ కు ఇది అగ్నిపరీక్షగా అంచనావేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.