తెలంగాణలో గవర్నర్, కేసీఆర్ సర్కార్ మధ్య విమర్శల పర్వం సాగుతూనే ఉంది. గవర్నర్, ప్రతిపక్షాలు ఒక వైపు, పాలక పక్షం మరోవైపు అన్నట్టుగా వ్యవహారం తయారైంది. కేసీఆర్ సర్కార్‌కు మహిళలకు గౌరవం ఇవ్వడం చేతకాదని గవర్నర్ తమిళిసై మొదలుకుని కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సందర్భంలో గవర్నర్ తన పరిధి దాటి రాజకీయాలు మాట్లాడ్తుతున్నారని మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురు దాడికి దిగారు.
గవర్నర్ తమిళిసైపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటు విమర్శలు చేశారు. రాజ్యాంగపరమైన హోదాలో ఉన్న గవర్నర్ పరిమితులకు లోబడి మాట్లాడాలని హితవు పలికారు. గవర్నర్ చట్ట పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారం మాట్లాడ్డం సరైంది కాదని ఆయన అన్నారు.
గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఉందన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాధ్యతా రాహిత్యం అవుతుందన్నారు. మీడియాతో గవర్నర్ రాజకీయాలు మాట్లాడకూడదని తలసాని హితవు చెప్పారు. గవర్నర్‌ను గౌరవించాలో తమతో పాటు తమ సీఎంకు తెలుసన్నారు. గవర్నర్లను గౌరవించడంలో అందరికంటే సీఎం కేసీఆర్ ముందుంటారన్నారు.
గవర్నర్‌ను గౌరవించడంలో ఎలాంటి లోటుపాట్లు లేనప్పుడు విమర్శలు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసిన తర్వాత తమపై విమర్శలు చేయడం ఏంటని ఆయన నిలదీశారు. ప్రజలు ఎన్నుకున్న, మెజార్టీ వున్న ప్రభుత్వాన్ని గవర్నర్ ఎలా రద్దు చేస్తారని తలసాని ప్రశ్నించారు.