జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో చాలా మంది చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రత్యేకించి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మెరుగైన స్థాయిలో ఉండాలనే కోరికలను సహజంగానే వ్యక్తం చేస్తారు. మరి ఇవన్నీ ఉన్నత స్థాయిలో ఉన్నంత మాత్రానా కాపురం కూడా అంతే ఉన్నతంగా ఉంటుందా అంటే మళ్లీ సందేహమే! ఇలాంటి భోగభాగ్యాలను చూసి చేసే అరెంజ్డ్ మ్యారేజెస్ అయినా, ఇలాంటి ఆకర్షణల ద్వారా సాగే ప్రేమ వివాహాలు అయినా.. అంచనాలకు తగ్గట్టుగా సాగుతాయనే నమ్మకాలు ఏమీ లేవు! మరి ఇవన్నీ పెళ్లి జరగడానికి కారణంగా నిలవొచ్చేమో కానీ, కాపురం సవ్యంగా సాగడానికి అయితే కాదు! ఇవన్నీ ఉంటే హ్యాపీనే, అయితే ఇవన్నీ ఉన్నా కొన్ని లక్షణాలు లేకపోతే మాత్రం కాపురం అంత తేలిక కాదు! ఇంతకీ ఆ లక్షణాలు ఏమిటంటే!
కాంప్రమైజ్ అయ్యే స్వభావం!
మనిషికి ఇది చాలా ముఖ్యం. తాము అస్సలు కాంప్రమైజ్ కామని ఎవరైనా అంటే.. అది వారి గొప్పదనం ఏమీ కాదు!కనీసం పెళ్లి చేసుకుని, తమతో బంధంలోకి అడుగుపెట్టిన వ్యక్తి కోసమైనా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సిందే! అస్సలు తగ్గేది లేదు, కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు.. అదెవరైనా సరే! అంటే మాత్రం.. ఇలాంటి స్వభావం ఉంటే మాత్రం ఆ కాపురం కళ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఎంతసేపూ తాము పట్టిందే జరగాలి, తాము కోరుకున్నట్టుగానే జరగాలి అనే వ్యక్తుల స్వభావం వల్ల కాపురాలు కల్లోలాలుగా మారతాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇలాంటి వ్యక్తులతో పార్ట్ నర్ కాసేపు కన్వీన్స్ అయినా, జీవితాంతం కన్వీన్స్ అవుతూ బతుకీడుస్తున్నా.. అది ఆనందకరమైన వైవాహిక జీవిత లక్షణం అయితే కాదు! జీవితంలో కాంప్రమైజ్ అయిన చరిత్ర ఉన్న వారు, అవసరార్థం కాంప్రమైజ్ కాగల స్వభావం ఉండటం కూడా ఒక విధంగా హ్యాపీ లైఫ్ కు పునాదే!
ఎమోషనల్ సపోర్ట్, కేర్!
ప్రేమ అంటే.. ముద్దులాడటమే కాదు! ప్రత్యేకించి కేర్ చూపించడం. భార్యాపిల్లల విషయంలో ఎంత కేరింగ్ ఉంటారనేదే నిజమైన ప్రేమ! వారి కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, ఎంత సమయం గడుపుతారు, ఎంత ప్రాధాన్యతను ఇస్తారనేదే ప్రేమ. అవసరమైన సందర్భాల్లో ఎమోషనల్ గా కూడా ఎంత సపోర్ట్ ఇస్తారనేదే సవ్యమైన కాపురానికి తార్కాణం. అందంగా ఫొటోలు దిగడం, లైంగిక వాంఛలు ,ఆర్థిక అవసరాలే ప్రేమ అనుకోలేం! ఇవన్నీ కాపురంలో భాగమే అయినా, కేర్ తీసుకోవడం, ఎమోషనల్ గా సపోర్ట్ చేయడం ఈ రెండూ వైవాహిక జీవితంలో పరమార్థం!
పరస్పర నమ్మకం!
ఇది లోపించి కూడా కాపురాలను కల్లోలాలుగా మార్చుకునే వారు ఎంతో మంది. భార్య విషయంలో భర్తకు నమ్మకం, భర్తపై భార్యకు నమ్మకం ఈ రెండూ ఉండాల్సిందే! ఈ నమ్మకం చంచలంగా మారితే మాత్రం ఇరు జీవితాలకూ అది నరకప్రాయమే! తనపై నమ్మకం లేదు అనే భావన అవతలి వారిని కుంగదీయడమే కాదు, పార్ట్ నర్ పై నమ్మకం లేకపోతే స్వీయజీవితం కూడా నరకప్రాయమే. అపనమ్మకం అనేది చాలు కాపురాన్ని కుంగదీయడానికి. నమ్మకం అంటూ లేకపోతే.. దాన్ని దాంపత్యం అననక్కర్లేదు! ఫోన్లు, సోషల్ మీడియా యుగంలో.. నమ్మకం అనేది ఇరువురి మధ్యన లేకపోతే.. దాంపత్యంలో నలిగిపోతున్నట్టే లెక్క!
సెన్సాఫ్ హ్యూమర్!
పరస్పరం సరదాగా మాట్లాడుకునే స్వతంత్రం ఉండని కాపురాలు కూడా ఉంటాయా అనే సందేహం వ్యక్తం కావొచ్చు కానీ, మరీ సీరియస్ గా బంధాన్ని సాగించే వాళ్లూ ఉంటారు. కలిసి నవ్వుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం, ఒకరి మాటలకు మరొకరు హాస్యభరితంగా స్పందించడం ఇవి బంధాన్ని పదిల పరుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తీపిగురుతులు అంటే ఇలాంటివే! శృంగారానికి మించి గుర్తుండేపోయేవి ఇవే!
లక్ష్యాలు కూడా కలగలసి ఉండటం!
ఇరు వురి లక్ష్యాలూ కలగలిసి ఉండటం దాంపత్యంలో అత్యంత సాన్నిహిత్యాన్ని కలిగిస్తాయి. మరి లక్ష్యాలు కలగలిసి ఉండటం అంటే.. జీవితాలను కరిగించేసి డబ్బులు సంపాదించాలనే విషయాల్లోనో, లేదా ఆర్థిక పరమైన అంశాల్లోనే కాదు.. ఆసక్తులు, ఆనందాలు, పని.. ఇలాంటి విషయాల్లో ఇద్దరూ ఒకే పంథాతో ఉంటే.. అది పరస్పరం అందించుకునే కీలకమైన సహకారం అవుతుంది. భర్త చేసే పనిపై భార్యకు అసంతృప్తి ఉన్నా, భార్య ఉద్యోగం చేయడంపై భర్తకు కంప్లైంట్లు ఉన్నా.. రాజీ పడి సాగిపోవడమే అవుతుంది. ఇలాంటి విషయాల్లో కూడా అర్థం చేసుకుని సాగడం, పరస్పరం లక్ష్యాల సాధనకు సహకరించుకోవడం ఆనందకరమైన వైవాహికజీవితానికి నిదర్శనం.
Maku ledhu