సెలబ్రిటీలకు ట్రోలింగ్ అనేది ఇప్పుడో పెద్ద సమస్యగా మారింది. కొంతమంది ట్రోల్స్ పై ఓవర్ గా రియాక్ట్ అవుతుంటారు, మరికొంతమంది లైట్ తీసుకుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి ఫాలో అవుతుంటారు. మరి హీరోయిన్ నయనతార ఏం చేస్తుంది?
“ట్రోలింగ్ ను ఎదుర్కోవడం చాలా పెద్ద సవాల్. అయితే నేను అన్ని ట్రోల్స్ ను పట్టించుకోను. నిర్మాణాత్మకంగా ఉండే విమర్శల్ని తీసుకుంటాను. ట్రోల్స్ కంటే ఎక్కువగా సానుకూలంగా ఉండే అభిప్రాయాల్ని చూడ్డానికి లేదా చదవడానికి ఇష్టపడతాను. కొన్నిసార్లు మనకు సంబంధం లేకుండానే ట్రోలింగ్ మొదలవుతుంది. కొన్ని బాహ్య శక్తుల వల్ల అలాంటివి జరుగుతాయనే విషయాన్ని అర్థం చేసుకుంటే.. పెద్దగా బాధపడాల్సిన అవసరం ఉండదు. ఏదేమైనా ట్రోలింగ్ జరిగినప్పుడు దాన్ని ఫేస్ చేయడం నాకు కొంచెం కష్టమే.”
సానుకూల దృక్పథం కలిగిన వ్యక్తులు, నిర్మాణాత్మక విమర్శలు, సలహాలు ఇచ్చే వ్యక్తులు ఎప్పుడూ తన చుట్టూ ఉండేలా చూసుకుంటానని.. అలా పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకుంటున్నానని తెలిపింది నయనతార. మన చుట్టూ మంచి సపోర్టింగ్ సిస్టమ్ ఉంటే ట్రోలింగ్స్ ను ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదంటోంది.
పాజిటివ్ గా ఉండే వ్యక్తుల్ని చుట్టూ పెట్టుకోవడంతో పాటు.. మానసికంగా దృఢంగా ఉండేందుకు మెడిటేషన్ లాంటివి చేస్తానని, వాటివల్ల ట్రోలింగ్స్ జరిగినప్పుడు ఎదుర్కోవడానికి కావాల్సినంత మానసిక ధైర్యం తనకు దొరుకుతుందని చెబుతోంది నయనతార.