టీమిండియా.. చారిత్రాత్మ‌క విజ‌యం!

బ్రిస్బెన్ టెస్టులో సంచ‌ల‌నం న‌మోదు అయ్యింది. టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఒక అరుదైన ఘ‌ట్టం చోటు చేసుకుంది. టీమిండియా కుర్రాళ్లు సంచ‌ల‌నం రేపారు. ప్ర‌పంచ అగ్ర‌శ్రేణి పేస్ ద‌ళాన్ని ఎదుర్కొంటూ.. రికార్డు స్థాయి టార్గెట్…

బ్రిస్బెన్ టెస్టులో సంచ‌ల‌నం న‌మోదు అయ్యింది. టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఒక అరుదైన ఘ‌ట్టం చోటు చేసుకుంది. టీమిండియా కుర్రాళ్లు సంచ‌ల‌నం రేపారు. ప్ర‌పంచ అగ్ర‌శ్రేణి పేస్ ద‌ళాన్ని ఎదుర్కొంటూ.. రికార్డు స్థాయి టార్గెట్ ను చేజ్ చేసి రికార్డు సృష్టించారు.

ఇంత వ‌ర‌కూ టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో నాలుగో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ల‌ను చేజ్ చేసిన అతి త‌క్కువ సంద‌ర్భాల్లో ఒక‌టిగా నిలుస్తోంది బ్రిస్బేన్ లో భార‌త జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌. 327 ప‌రుగుల‌ను చేజ్ చేసి.. ఒక అరుదైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది టీమిండియా.

అనేక మ‌లుపుల్లా సాగిన చివ‌రి రోజు ఆట భార‌త క్రికెట్ అభిమానుల‌కు చిరస్మ‌ర‌ణీయంగా నిలుస్తోంది. ఆస్ట్రేలియ‌న్ క్రికెట్ జ‌ట్టుకు పెట్ట‌ని కోట‌గా పేరున్న బ్రిస్బెన్ లో టీమిండియా సాధించిన విజ‌యం మ‌ర‌పురానిది అవుతోంది. గ‌త మూడు ద‌శాబ్దాల్లో ఎప్పుడూ ఆస్ట్రేలియా ఈ మైదానంలో ఎప్పుడూ ఓడిపోలేదు. 1988లో చివ‌రిసారి ఈ మైదానంలో ఆస్ట్రేలియ‌న్ జ‌ట్టు ఓడిపోయింది. ఆ త‌ర్వాత ఈ మైదానంలో తిరుగులేని ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తూ వ‌చ్చింది.

ఈ పిచ్ మీద ఆస్ట్రేలియ‌న్ జ‌ట్టుకు ఎంత న‌మ్మ‌కం అంటే.. మూడో టెస్టు స‌మ‌యంలో బ్యాటింగ్ చేస్తున్న ర‌విచంద్ర‌న్ అశ్విన్ తో ఆసీస్ కెప్టెన్ పైన్ స్లెడ్జ్ చేస్తూ.. బ్రిస్బెన్ కు రావాల‌ని అక్క‌డ మీ అంతు చూస్తామ‌న్న‌ట్టుగా మాట్లాడాడు. ఈ బౌన్సీ ట్రాక్ పై ఆస్ట్రేలియాకు అంత న‌మ్మ‌కం! ఈ మైదానంలో గెలిచి సీరిస్ ను నెగ్గేయ‌వ‌చ్చన్న‌ ఆస్ట్రేలియన్ జ‌ట్టు కు టీమిండియా గ‌ట్టి స‌మాధానం ఇచ్చింది.

బ్రిస్బెన్ లో గ‌తంలో భార‌త్ ఎప్పుడూ గెల‌వ‌క‌పోవ‌చ్చు కానీ, తొలిసారి గెల‌వొచ్చు అన్న మాజీ ఆట‌గాడు గ‌వాస్క‌ర్ మాటే నిజ‌మైంది. బ్రిస్బెన్ లో భార‌త్ సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసింది.

ఒక‌వైపు ప్ర‌ధాన ఆట‌గాళ్లు, స్టార్లు జ‌ట్టుకు దూరం అయినా… కొత్త ఆట‌గాళ్ల అద్భుత రాణింపుతో అసాధ్య‌మ‌నుకున్న వేదిక‌పై భార‌త్ చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యం సాధించింది.

తొలి ఇన్నింగ్స్ బౌలింగ్ లో న‌ట‌రాజ‌న్, తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో శార్దూల్ ఠాకూర్, వాషింగ్ట‌న్ సుంద‌ర్.. రెండో ఇన్నింగ్స్ బౌలింగ్ లో సిరాజ్, ఠాకూర్, రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ లో గిల్, పుజారా, పంత్, వాషింగ్ట‌న్ సుంద‌ర్ లా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో టీమిండియా ఈ విజ‌యాన్ని సాధించింది.

చివ‌రి రోజు 324 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భార‌త్ కు ఆదిలోనే రోహిత్ శ‌ర్మ ఔట్ కావ‌డంతో ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ త‌ర్వాత గిల్, పుజ‌రాలు అద్భుతంగా ఆడారు. పుజారా డిఫెన్స్ కు ప్రాధాన్యం ఇవ్వ‌గా గిల్ త‌న‌దైన స్ట్రోక్స్ తో అల‌రించాడు. స్కోర్ బోర్డులో క‌ద‌లిక తీసుకొచ్చాడు. సెంచ‌రీకి ద‌గ్గ‌ర ప‌డ్డ స‌మ‌యంలో గిల్ ఔట్ అయ్యాడు. అయితే విజ‌యం సాధ్య‌మవుతుంది అనే భ‌రోసా ఆ త‌ర్వాత కూడా కొన‌సాగింది. 

వేగంగా ఆడే క్ర‌మంలో ర‌హ‌నే వికెట్ కోల్పోయినా.. ఆ త‌ర్వాత పంత్, పుజ‌రాలు మ‌రో మంచి భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. పుజారా ఔట్ కావ‌డంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. మ‌యాంక్ ఔట్ అయిన త‌ర్వాత‌ వ‌చ్చిన వాషింగ్ట‌న్ సుంద‌ర్ క‌థ అయిపోలేద‌నే సందేశాన్ని ఇచ్చాడు. క‌మ్మిన్స్ ఓవ‌ర్లో సిక్స్, ఫోర్ ల‌తో జ‌ట్టును విజ‌యం దిశ‌గా సాగుతోంద‌నే సందేశాన్ని ఇచ్చాడు.

ఇక పంత్ అద్భుత బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆఖ‌రి ప‌ది ఓవ‌ర్ల‌లో వ‌న్డే, టీ-20 త‌ర‌హా బ్యాటింగ్ చేసి.. టీమిండియాకు చారిత్రాత్మ‌క విజ‌యాన్ని సాధించి పెట్టారు. 89 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచిన పంత్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ ద‌క్కింది. ఆసీస్ బౌల‌ర్ క‌మ్మిన్స్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ద సీరిస్ ద‌క్కింది. ఈ విజ‌యంతో 2-1 తేడాతో మ‌రోసారి ఆసీస్ వేదిక‌గా బోర్డ‌ర్- గ‌వాస్క‌ర్ ట్రోఫీని గెలిచి, నిల‌బెట్టుకుంది టీమిండియా.

చంద్ర‌బాబు పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఎన్టీ రామారావు,జ‌గ‌న్ ల‌కు కొన్నిపోలిక‌లు