రిపోర్టు కార్డులో ప్రత్యేకహోదా ఉన్నదా చిన్నమ్మా!

అమిత్ షా విశాఖలో బహిరంగ సభ నిర్వహించగా, ఆయన ఎదుట తమ ప్రతిభ చాటుకోవడానికి భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులందరికీ కూడా పూనకం వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ కార్యక్రమాల్లో లేకుండా సైలెంట్ గా…

అమిత్ షా విశాఖలో బహిరంగ సభ నిర్వహించగా, ఆయన ఎదుట తమ ప్రతిభ చాటుకోవడానికి భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులందరికీ కూడా పూనకం వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ కార్యక్రమాల్లో లేకుండా సైలెంట్ గా గడుపుతున్న వారంతా కూడా.. ఒక్కసారిగా జగన్ సర్కారు మీద విమర్శలు కురిపించడానికి ఉత్సాహపడుతున్నారు. అలాటి వారిలో చిన్నమ్మ పురందేశ్వరి కూడా ఉంది. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదనే కినుకతో పార్టీ కార్యక్రమాల పట్ల అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చిన పురందేశ్వరి, ఇప్పుడు ఎన్నికల సీజను వస్తుండేసరికి యాక్టివేట్ అవుతున్నట్టు కనిపిస్తోంది.

ప్రధానంగా మోడీ సర్కారు తొమ్మిదేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఆ పార్టీ దేశమంతా తాము సాధించిన ప్రగతిని తెలియజెప్పే సభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో జరిగిన నడ్డా, అమిత్ షా సభలు కూడా అలాంటివే. అయితే పురందేశ్వరి విశాఖ సభలో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో తాము ఒక ప్రోగ్రెస్ రిపోర్టు కార్డును తయారుచేసి, దానితో ప్రజల ఎదుటకు వెళ్తాం అని అంటున్నారు. 

సరే.. ఈ సీజనులో మోడీ కోరుకుంటున్నట్టుగా ఆయన భజన చేయడానికి పార్టీ నాయకులందరూ అత్యుత్సాహపడుతుంటారని అనుకోవచ్చు. కానీ అదే సమయంలో అలాంటి ప్రోగ్రెస్ రిపోర్టు కార్డను తయారుచేసి ప్రజల ఎదుటకు వెళ్లగల ధైర్యం జగన్ సర్కారుకు ఉందా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

చిన్నమ్మ పురందేశ్వరి.. పార్టీమీద అలిగి చాన్నాళ్లుగా రాజకీయాలను పట్టించుకోకుండా అజ్ఞాతంలో ఉండిపోయినందువల్ల.. ఆమెకు చాలా వ్యవహారాలు తెలిసినట్టుగా లేదు. అసలు ప్రోగ్రెస్ రిపోర్టు లాంటి అయిడియాతో.. ప్రభుత్వం ఏం సాధించిందో ఆ వివరాలను ప్రింట్ చేసి మరీ ప్రజల ఎదుటకు వెళ్లి వారికి తెలియజెప్పాలనే అయిడియా పుట్టిందే జగన్మోహన్ రెడ్డి మదిలో. 

గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో వారు చేసిన పని అదే. తమ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేనిఫెస్టో కాపీతో సహా అందులో ఏమేం నెరవేర్చామో ఇంటింటికీ తిరిగి చెప్పారు. బహుశా ఆ సమయంలో పురందేశ్వరి సుషుప్తావస్థలో ఉండి ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే జగన్ సర్కారు ప్రతి ఇంటికీ తమ ప్రభుత్వం ఏం చేసిందో విడివిడిగా తెలియజెప్పేలా ప్రింట్ చేసి మరీ ఇచ్చారు. అలా ఇంటింటికీ తామేం చేశామో చెప్పగల ధైర్యం మోడీ దళానికి ఉందా అని వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు.

చిన్నమ్మ మరో సంగతి కూడా గమనించాలి. మొత్తం ప్రోగ్రెస్ రిపోర్టు కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వేజోన్, వెనుకబడ్డ ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ అనేవి బిజెపి పార్టీ 2014 ఎన్నికలకు పూర్వం ప్రకటించిన వరాలు. వాటిని మాత్రం ఈ తొమ్మిదేళ్లలో ఏ మేరకు నెరవేర్చారో చెప్పండి చాలు. ప్రోగ్రెస్ కార్డులో అవి కూడా పెట్టండి చాలు అని ప్రజలు కోరుకుంటున్నారు.