ఆర్ఆర్ఆర్.. భారీ బడ్జెట్ ఓకే, అసలు బడ్జెట్ ఎంత?

భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఇంతవరకు ఓకే. మరి ఈ సినిమా అసలు బడ్జెట్ ఎంత? కొంతమంది 450 కోట్ల రూపాయలు అంటారు. మరి కొంత మంది 300…

భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఇంతవరకు ఓకే. మరి ఈ సినిమా అసలు బడ్జెట్ ఎంత? కొంతమంది 450 కోట్ల రూపాయలు అంటారు. మరి కొంత మంది 300 కోట్ల రూపాయలు మాత్రమే అయిందంటారు. నిజానికి ఈ బడ్జెట్ లెక్కలు బయటకు రావు. కానీ ఇకపై బడ్జెట్ లెక్కలన్నీ తెలియాల్సిందే. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం, భారీ బడ్జెట్ సినిమాలన్నీ తమ బడ్జెట్ ఎంత అనేది లెక్కలతో సహా చెప్పాల్సిందే.

ఆర్ఆర్ఆర్ సినిమా అసలు బడ్జెట్ 336 కోట్ల రూపాయలు. అయితే ఇది కొంతమంది రెమ్యూనరేషన్లతో పాటు ప్రొడక్షన్ కాస్ట్ కలిపి మాత్రమే. ఇందులోంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి రెమ్యూనరేషన్లు మినహాయించాలి. జీఎస్టీ కూడా మినహాయించగా.. ఆర్ఆర్ఆర్ బడ్జెట్ 336 కోట్ల రూపాయలుగా తేలింది. ఈ మేరకు నిర్మాత డీవీవీ దానయ్య, ఏపీ ప్రభుత్వానికి లెక్కలు సమర్పించాడు.

ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. తాజాగా విడుదల చేసిన జీవోలో ఆ క్లాజ్ ఉంది. బడ్జెట్ వంద కోట్లు దాటితే, రిలీజ్ తేదీ నుంచి 10 రోజుల వరకు టికెట్ ధరలు (నిర్దేశిత మొత్తంలో) పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. 

అయితే బడ్జెట్ నిజంగానే 100 కోట్లు దాటిందా లేదా అనే విషయాన్ని జీఎస్టీ అధికారులు లెక్కతేలుస్తారు. ఇందులో భాగంగా అధికారులు ఆర్ఆర్ఆర్ మూవీ లెక్కల్ని చెక్ చేస్తున్నారు. అలా ఈ సినిమా బడ్జెట్ వివరాలు బయటకొచ్చాయి.

ఇకపై బడా సినిమాలన్నీ ఆ పని చేయాల్సిందే

ఇకపై వంద కోట్ల బడ్జెట్ దాటిన ఏ సినిమాకైనా ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ప్రత్యేక అనుమతి కావాలంటే, బడ్జెట్ లెక్కలు సమర్పించాల్సిందే. అధికారులు క్షుణ్నంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే టికెట్ రేట్ల పెంపునకు అనుమతినిస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆచార్య, సర్కారువారి పాట, ఎఫ్3, సలార్ సినిమాల బడ్జెట్ లెక్కల్ని ప్రభుత్వానికి సర్పించాల్సి ఉంటుంది. 

తమ సినిమాకు వంద కోట్ల రూపాయల బడ్జెట్ అయిందంటే సరిపోదు. ఖర్చుకు తగ్గ లెక్కలన్నీ సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు, వీటితో పాటు జీఎస్టీ చెల్లించిన తర్వాత మాత్రమే టికెట్ పెంపుపై పర్మిషన్ వస్తుందన్నమాట.

మరోవైపు ఏపీ థియేటర్లలో 5వ ఆటకు సంబంధించి కూడా నిబంధనల్ని స్పష్టంగా వివరించారు. ఓ పెద్ద సినిమా విడుదలైనప్పుడు రోజులో 5 షోలు కేటాయించకుండా.. ఆ సినిమాతో పాటు ఏదైనా చిన్న సినిమా విడుదలైతే, ఆ చిన్న చిత్రానికి కూడా షో ఇవ్వాలని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు.