ఇంతలోనే ఎంతో తేడా.. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులకు చాప చుట్టేసి వరల్డ్ క్రికెట్ లోనే వరెస్ట్ రికార్డును తన పేరు మీదకు రాసుకున్న టీమిండియా బ్యాట్స్ మన్ రెండో టెస్టులో కథ మార్చేశారు. అదే ఆస్ట్రేలియా మీద, అలాంటి బౌన్సీ ట్రాక్ మీద విజయానికి చేరువయ్యారు. బ్యాటింగ్ లో రాణింపు, బౌలింగ్ లో నిప్పులు చెరగడం ద్వారా ఆతిథ్య జట్టును ఓటమి బాట పట్టిస్తోంది టీమిండియా.
తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ రహనే సాధించిన అద్భుత శతకంతో, జడేజా రాణింపుతో 131 పరుగుల మెరుగైన ఆధిక్యతను సంపాదించింది టీమిండియా. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియన్ జట్టు టాప్ ఆర్డర్ ను భారత బౌలింగ దళం ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఆరంభంలోనే ఉమేష్ యాదవ్ వికెట్ తీయగా, ఆ తర్వాత అశ్విన్ అదే జోరును కొనసాగించాడు. ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్ మన్ స్మిత్ ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత హెడ్, వేడ్, పైన్ ల వికెట్లు కూడా ఆస్ట్రేలియా ఆధిక్యం సాధించక ముందే పడ్డాయి. కొత్త కుర్రాడు బర్స్న్, ఇక బౌలర్లు మిగిలారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ ఆధిక్యం నాలుగు పరుగులుగా ఉంది.
నాలుగో రోజు ఆటలో వీలైనంత త్వరగా మిగిలిన లోయర్ ఆర్డర్ వికెట్లను భారత బౌలర్లు సాధిస్తే.. రెండో ఇన్నింగ్స్ లో బ్యాట్స్ మెన్ ముందు స్వల్ప లక్ష్యమే మిగిలే అవకాశం ఉంది. తొలి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లోలా భారత బ్యాట్స్ మెన్ బ్యాట్లు ఎత్తేస్తే తప్ప.. రెండో టెస్టులో టీమిండియా విజయం లాంఛనంగానే కనిపిస్తూ ఉంది. అలాంటి చెత్త రికార్డులకు అవకాశం ఇవ్వకుండా.. ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.