దాదాపు రెండేళ్ల కిందట ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించడం మొదలై, మానవాళిని భయాందోళనలకు గురి చేసిన కరోనా వైరస్ కు సంబంధించి చికిత్స విధానాల్లో చాలా మెరుగుదల కనిపిస్తోందని అంటున్నాయి నంబర్లు. అంతర్జాతీయంగా గత కొన్ని నెలలుగా కరోనా వ్యాప్తి, కరోనా కారణంగా హాస్పటలైజ్ అయిన వారు, కరోనా కారణంగా మరణించిన వారు.. ఈ నంబర్లను విశ్లేషిస్తూ, కరోనా ఆరంభం నాటి పరిస్థితులతో వీటిని పోల్చి చెబుతున్న వారు ఈ విషయాన్ని చెబుతున్నారుజ
కరోనా అంతర్జాతీయంగా అలజడి పుట్టించిన 2020 నాటి సంవత్సరం తొలి సగం నాటి పరిస్థితులతో పోలిస్తే.. గత నాలుగైదు నెలల నాటి పరిస్థితుల్లో చాలా మెరుగుదల ఉందనేది విశ్లేషణ. ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ ల సమయాలతో పోలిస్తే మూడో వేవ్ లో అంతటా జననష్టం, ఆరోగ్య పరిస్థితి దెబ్బతిని హాస్పిటలైజ్ కావడం బాగా తగ్గింది. దీనికి పలు కారణాలున్నాయని చెబుతున్నారు.
అందులో ఒకటి ఒమిక్రాన్ వేరియెంట్ రూపంలో కరోనా స్వల్ప స్థాయి సింప్టమ్స్ తో ఎంతోమందికి సోకింది. మొదటి వేరియెంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియెంట్ లో ఎక్కువ మందికి కరోనా సోకిందని అంచనా. అయినప్పటికీ ఈ వేరియెంట్ తో హాస్పిటలైజ్ అయిన వారి సంఖ్యే తక్కువని అనేక దేశాల వైద్యులు మొదటి నుంచి చెబుతున్నారు.
ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా సానుకూల ఫలితాలను ఇచ్చిందని వైద్య పరిశోధకులు నొక్కి వక్కాణిస్తున్నారు. వ్యాక్సినేషన్ విస్తృతంగా జరగడం వల్ల కూడా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ఆరోగ్యాలు దెబ్బతినడం బాగా తగ్గిందని చెబుతున్నారు. అలాగే కరోనా సోకిన వారికి అందించే చికిత్స విషయంలో కూడా వైద్యులకు ఎంతో కొంత స్పష్టత రావడం కూడా మరో సానుకూలాంశం అని చెబుతున్నారు. ఫస్ట్ వేవ్ లో, సెకెండ్ వేవ్ లో ఎడాపెడా మందులను ఇచ్చారు.
అనేక రకాల ప్రయోగాలు చేశారు. ఆ తర్వాత మూడో వేవ్ లో పారాసిటమల్ దగ్గరకే వచ్చారు. మొదటి వేవ్ లలో డాక్టర్లు ఏది రాసినా ప్రజలు వాటిని వాడారు. మూడో వేవ్ దగ్గరకు వచ్చేసరికి ప్రజలే కాస్త ఆలోచించడం మొదలైంది. ఈ మార్పును అంతా గమనించారు. స్థూలంగా వైద్యులకు కూడా కరోనాకు ట్రీట్ మెంట్ విషయంలో మూడో వేవ్ నాటికి స్పష్టత రావడం కూడా పరిస్థితి నియంత్రణలోకి రావడానికి ఒక కారణమని ఇటీవలి పరిస్థితులపై అధ్యయనం చేసిన వారు చెబుతున్నారు.