ఎమ్బీయస్‍: పంజాబ్‌లో దళిత ప్రాధాన్యత

పంజాబ్‌ను పాలిస్తున్న కాంగ్రెసు యీ ఎన్నికలలో సిఎం అభ్యర్థిగా ఎవర్ని చూపించుకోవాలో చాలాకాలం తేల్చుకోలేక పోయింది. కెప్టెన్‌ను పంపించివేశాక, సిద్దూ ఆ స్థానం కోసం పట్టుబట్టాడు. కానీ రాహుల్ హరిజనుడైన చన్నీని ఎంపిక చేశాడు.…

పంజాబ్‌ను పాలిస్తున్న కాంగ్రెసు యీ ఎన్నికలలో సిఎం అభ్యర్థిగా ఎవర్ని చూపించుకోవాలో చాలాకాలం తేల్చుకోలేక పోయింది. కెప్టెన్‌ను పంపించివేశాక, సిద్దూ ఆ స్థానం కోసం పట్టుబట్టాడు. కానీ రాహుల్ హరిజనుడైన చన్నీని ఎంపిక చేశాడు. సిద్దూ అతన్ని కాల్చుకుతింటూ, అతనొక డమ్మీ అని ప్రజలకు చూపించాడు. అతన్ని చూపించి ఎన్నికలలో గెలిచాక తనే సిఎం అవుతాడనే అభిప్రాయాన్ని కలిగించాడు. కాంగ్రెసు అధిష్టానం దానికి తగ్గట్టుగానే యిద్దర్నీ అభ్యర్థులుగా చూపిస్తూ వచ్చింది. కానీ ఒక స్టేజి వచ్చేసరికి మా యిద్దరిలో ఎవరో స్పష్టంగా చెప్పండని చన్నీ, సిద్దూ యిద్దరూ అడిగారు. కాస్త తర్జనభర్జన తర్వాత కాంగ్రెసు చన్నీనే ఎంచుకుంది. ప్రస్తుతానికి సిద్దూ ఊరుకున్నట్లు కనబడుతున్నాడు కానీ లోపాయికారీగా ఏం చేస్తాడో, ఫలితాల తర్వాత ఎటు దూకుతాడో తెలియదు.

దళిత ఓటు గురించే కాంగ్రెసు చన్నీని తొలి దళిత సిఎంగా ఛాన్సిచ్చింది. వచ్చేసారీ అతనే అంటోంది. అతను దళితులలో విద్య, ఆర్థికపరంగా మెరుగైన స్థితిలో వున్న రవిదాసియా ఉపకులానికి చెందినవాడు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే గురు రవిదాస్ జయంతికి క్లాష్ వస్తోంది కాబట్టి దాన్ని మార్చమని అడిగాడు. తక్కిన పార్టీలు వంత పాడాయి, ఆ విధంగా దళితుల మెప్పు పొందవచ్చనుకుని కాబోలు! ప్రస్తుతం 3 స్థానాలున్న బిజెపి తాము గెలిస్తే దళితుణ్ని సిఎం చేస్తామని 2021 ఏప్రిల్‌లోనే ప్రకటించింది. ఆప్ అయితే దళిత ఎమ్మెల్యేను అసెంబ్లీలో తమ పార్టీ నేతగా నియమించింది. ఇప్పుడు ఎన్నికలలో గెలిచాక ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోను భగత్ సింగ్, ఆంబేడ్కర్ బొమ్మలు తప్ప తక్కినవారివి పెట్టమని హామీ యిస్తోంది.

సిఎం అభ్యర్థుల్లో ప్రస్తుతానికి దళితుడు చన్నీ ఒక్కడే. అతని వివరాలేమిటి? 58 ఏళ్లు. తండ్రి గ్రామ సర్పంచ్. బాగా చదువుకున్నాడు. మూడు పిజిలున్నాయి. డాక్టరేటు కోసం ఇంకా చదువుతూనే వున్నాడు. భార్య డాక్టరు. 39 ఏళ్లకు కౌన్సిలర్‌గా, 44 ఏళ్లకు స్వతంత్ర ఎమ్మెల్యేగా అయ్యి, బిజెపి-అకాలీ ప్రభుత్వాన్ని సమర్థించాడు. 2012లో కెప్టెన్ అతన్ని కాంగ్రెసులో చేర్పించాడు. అప్పణ్నుంచి కాంగ్రెసు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2017లో కెప్టెన్ కాబినెట్‌లో సాంకేతిక విద్యామంత్రిగా ఉన్నాడు. పార్టీలోంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా కెప్టెన్ సిద్దూని పనికిమాలిన మంత్రి అన్నాడు కానీ చన్నీని సమర్థుడని, మంచివాడని మెచ్చుకున్నాడు. అవినీతి మచ్చ లేదు. సౌమ్యుడు. అందరికీ అందుబాటులో వుంటూ, నిరాడంబరంగా, చురుగ్గా పనిచేస్తూ, పబ్లిసిటీ బాగా చేసుకుంటున్నాడు. ప్రధాని పంజాబ్ పర్యటనలో జరిగిన భద్రతా వైఫల్యం సంఘటనలో అతని స్పందన కూడా హుందాగా వుంది.

మంచి వక్త, పబ్లిక్ ఫిగర్, అట్టహాసం చేయడంలో దిట్ట ఐన సిద్దూని పక్కన పెట్టి, చన్నీని ఎంపిక చేయడానికి కారణం పంజాబ్‌ జనాభాలో 32% ఉన్న హరిజనుల సంఖ్యాబలం. మరి యిన్నేళ్లుగా వాళ్లని పట్టించుకోకుండా కాంగ్రెసు కానీ, అకాలీదళ్ కానీ జాట్ శిఖ్కులనే సిఎంగా ఎందుకు చేస్తూ వచ్చింది అనే ప్రశ్న సహజంగా వస్తుంది. జవాబు సింపుల్. వాళ్లు మూకుమ్మడిగా ఎప్పుడూ ఓటేయలేదు. అసలు వాళ్లలోనే 39 ఉపకులాలు, మతపరంగా తేడాలు కూడా ఉన్నాయి.  మతాలవారీగా, కులాల వారీగా పంజాబ్‌ను చూడాలంటే శిఖ్కులు 60%, హిందువులు 36.2%. ఇతరులు (ముస్లిములు, క్రైస్తవులు, జైనులు వగైరా) 3.8%. హిందూశిఖ్కులను కలిపేసి కులాల వారీగా చూస్తే, 33% ఉన్న అగ్రవర్ణాలలో జాట్ శిఖ్కులు 18%, బ్రాహ్మణ, క్షత్రియ, బనియా, రాజపుత్రులు 15%, ఒబిసి (శిఖ్కు రాజపుత్రులు, సైనీలు వగైరా) 31.3%, హరిజనులు 32% (వీరిలో మజహబీలు 10, రామదాసియా, రవిదాసియా, ఆదిధర్మీ కలిపి 13, వాల్మీకి 3.5, బాజీగర్ 1, ఇతరులు 4)

హరిజనుల్లో కొందరు శిఖ్కులు, మరి కొందరు హిందూలు. అది ఒక ప్రధానమైన చీలిక. హిందూ దళితుల్లో చాలామంది శిఖ్కుమతంలోకి మారిపోతూ వుండడం చేత అంకెలు స్థిరంగా లేవు. పంజాబ్ హరిజనుల్లో 80% మంది 5 ఉపకులాలకు చెందినవారు. వారిలో మజహబీలు 30%, రవిదాసియాలు 24%, ఆదిధర్మీలు 11% ఉన్నారు. రవిదాసియాలు, ఆది ధర్మీలు ప్రధానంగా చర్మకారులు కాగా, మజహబీలు, వాల్మీకులు ప్రధానంగా పారిశుధ్య పనివారు. హిందువులైతే వాల్మీకి అంటారు. శిఖ్కు మతంలోకి మారితే మజహబీ లంటారు. శిఖ్కు మతంలోకి మారిన ఆదిధర్మీలు రవిదాసియా, రామదాసియాలు అవుతారు. రవిదాసియాలు ఆర్థికంగా, విద్యాపరంగా మంచి స్థితిలో వున్నారు. వారికి ప్రత్యేకంగా డేరాలు ఉన్నాయి. దోఆబా ప్రాంతంలో వారికి మంచి పలుకుబడి వుంది. విదేశాల్లో స్థిరపడిన రవిదాసియాల నుంచి వాటికి నిధులు అందుతూ వుంటాయి.

ప్రాంతాల వారీగా పంజాబ్‌ను చూస్తే అది మూడు భాగాలుగా వుంది. మొత్తం 117 స్థానాలలో 69 స్థానాలున్న మాల్వా, 25 ఉన్న మాఝా, 23 ఉన్న దోఆబా. వెనకబడిన ప్రాంతమైన మాల్వా స్థానాల రీత్యా రాజకీయంగా కీలకమైనది. మాల్వా ప్రాంతంలో అకాలీలకు గట్టి పట్టు ఉండేది. 2012లో 34 సీట్లు తెచ్చుకున్న ఆ పార్టీ (తక్కిన చోట్ల 22 తెచ్చుకుని, బిజెపితో కలిసి అధికారంలోకి వచ్చింది), 2017లో బిజెపితో కలిసి 8 మాత్రమే తెచ్చుకుంది. అకాలీ ఓటు కాంగ్రెసుకు బదిలీ అయి దానికి 40 వచ్చాయి. (తక్కిన చోట్ల 37 తెచ్చుకుని, అధికారంలోకి వచ్చేసింది) కొత్తగా రంగంలోకి దిగిన ఆప్‌కు 18 వచ్చాయి. (తక్కిన చోట్ల దానికి రెండే వచ్చాయి). ఈసారి ఆప్‌కు విజయావకాశాలు బాగున్నాయని అంటున్నారు. అది అడ్డుకోవాలంటే దానికి పట్టున్న మాల్వాలోనే దెబ్బ కొట్టాలని కాంగ్రెసు, అకాలీ శ్రమిస్తున్నాయి.

మాల్వా జనాభాలో 31% మంది దళితులున్నారు. దోఆబాలో అయితే 37%, మాఝాలో 29% ఉన్నారు. ఈ ఓట్ల కోసమే అకాలీ 2021 జూన్‌లోనే బియస్పీతో పొత్తు పెట్టుకుని 20 సీట్లు కేటాయించింది. దళితులు గంపగుత్తగా ఓటేస్తేనే బియస్పీ తన సత్తా చాటగలదు. కానీ పంజాబ్‌లో ఆ పరిస్థితి లేదు. అందుకనే 2007లో 4.2%, 2012లో 4.3% ఓట్లు తెచ్చుకున్న బియస్పీ 2017 వచ్చేసరికి 1.5% మాత్రమే తెచ్చుకుంది. సీట్లేమీ గెలవలేదు. 111 స్థానాల్లో పోటీ చేసి 110టిలో డిపాజిట్లు పోగొట్టుకుంది. మాయావతి ప్రస్తుతం నీరసపడి వున్నారు. యుపిలోనే కాళ్లు బారచాపి కూర్చున్నారు. ఇక అకాలీలకు ఏం ఉపయోగపడతారు?

శిఖ్కు దళితుల్లో చాలామంది డేరాలకు అనుయాయులు. డేరా అధిపతులు చెప్పిన ప్రకారం వాళ్లు ఓటేస్తారనే ఆశతో పార్టీలు డేరాల ఆగడాలను చూసీచూడనట్లు ఊరుకున్నాయి. అందుకే రామ్‌రహీమ్ అంతగా రెచ్చిపోయాడు. హత్యా నేరాలలో శిక్షపడడంతో అతను ప్రస్తుతం జైల్లో వున్నాడు. 2015లో గురుగ్రంథసాహెబ్‌ను అపవిత్రపరచిన సంఘటన సిద్దూ మాటిమాటికీ ప్రస్తావిస్తూంటాడు. ఆ ఘటన వెనక్కాల రామ్‌రహీమ్ అనుచరులున్నారని, వారిపై చర్యలు తీసుకుంటే దళిత, ముఖ్యంగా మజహబీ దళితులకు కోపం వస్తుందనే భయంతోనే అప్పుడు అధికారంలో వున్న అకాలీ కానీ, తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు కానీ చర్యలు తీసుకోలేదని అందరూ అనే మాట. అతను జైల్లో ఉన్నాడు కాబట్టి దళితులపై అతని ప్రభావం వుండదని, రాజకీయాభిమానాలతో ఓట్లు వేస్తారనీ పార్టీలన్నీ ఆశ పెట్టుకున్నాయి. అయితే కాంగ్రెసు పార్టీ సరిగ్గా ఎన్నికల వేళ అతన్ని 21 రోజుల పెరోల్ మీద బయటకు తీసుకుని వచ్చింది. అతనికి చెప్పి దళిత ఓట్లు వేయించుకుందామని ఆశ కాబోలు.

అగ్రకులాల కారణంగా శిఖ్కుమతంలో తమకు న్యాయం జరగటం లేదని, విద్య, వైద్యం, గౌరవం దక్కకుండా పోతోందని భావించిన మజహబీ (వీరిలో చాలామంది పారిశుధ్య పనిలో వుండటం చేత దళితుల్లో అట్టడుగు స్థాయిలో వున్నారు) శిఖ్కులు క్రైస్తవంలోకి మారుతున్నారు. దీనికి ఎవాంజలిస్టు గ్రూపులు ధనసహాయం చేస్తున్నాయని అకాల్ తఖ్త్ జాతేదార్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్‌కు 2021 అక్టోబరులో ఫిర్యాదు చేశాడు. దానిపై కమిషన్ చైర్మన్ పంజాబ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసి, దర్యాప్తు చేయమన్నాడు. ఇది యిలా సాగుతూండగానే ఎస్‌జిపిసి (శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ) మతమార్పిళ్లను ఆపడానికి ‘‘ఘర్ ఘర్ ధర్మశాలా’’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది.

ఈ అగ్రవర్ణ-దళిత ఘర్షణకు మతంతో పాటు ఆర్థిక కారణం కూడా వుంది. జాట్ శిఖ్కులు భూకామందులు కాగా, మజహబీలు రైతు కూలీలు, చిన్న రైతులు. 1961లో చేసిన చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో పోరంబోకు భూమిలో 33% భూమిని దళితులకు కేటాయించారు. ఏడాది కౌలుకి ఎవరైనా వేలం పాడుకుని, సాగు చేసుకోవచ్చు. దళిత రైతులకు వ్యక్తిగతంగా అంత స్తోమత వుండదు కాబట్టి, దశాబ్దాలుగా జాట్ శిఖ్కులు బినామీ దళితుల పేర వేలం పాడుకుని, వాళ్లే సాగు చేస్తున్నారు. 2016లో ఝాలూరులో కొందరు మజహబీలు సంఘంగా ఏర్పడి వేలం పాడబోతే జాట్ శిఖ్కులు వాళ్లని చావగొట్టారు. జనాభాలో జాట్ శిఖ్కులు 18% మాత్రమే వున్నా, ప్రయివేటు వ్యవసాయ భూమిలో 93% వాళ్ల చేతిలోనే ఉందిట. 32% ఉన్న దళితుల చేతిలో ఉన్నది 3.5% మాత్రమే. వారిలో మజహబీల చేతిలో ఉన్నది 0.1% మాత్రమే. జాతీయ స్థాయిలో అంకెలు చూడబోతే దళిత జనాభా 16.6% కాగా, వారి చేతిలో వున్న సాగుభూమి 8.6%. దీన్ని బట్టి పంజాబ్ దళితుల దుస్థితి అర్థమవుతుంది.

గ్రామ పంచాయితీల్లో చాలా భాగం జాట్ శిఖ్కుల చేతుల్లోనే వుంటాయి. వాటి ద్వారా వాళ్లు కూలీల వేతనాలు పెరగకుండా చూస్తున్నారు. బయటినుంచి వచ్చిన కూలీలకు ఎకరం భూమిలో విత్తనాలు నాటడానికి రూ. 4500 యిస్తున్నా, ఊళ్లో ఉన్న కూలీలకు మాత్రం 2500-3200 యిస్తున్నారు. పైగా వాళ్లు ఊరు వదిలి వేరే చోటకి వెళ్లి పని చూసుకోవడానికి వీల్లేదని ఆంక్షలు విధిస్తున్నారు. కూలీలలో చాలామంది మజహబీలే కాబట్టి వారికి యిది కడుపుమంటగా వుంది. మాఝా, దోఆబా ప్రాంతాల్లో యీ అంక్షలు లేకపోవడం చేత, అక్కడి మజహబీలు వలస కార్మికుల వలన ఉపాధి కోల్పోతే, పట్టణాలకు, సిటీలకు వెళ్లిపోయి పారిశుధ్య పనివారిగా, రోజువారీ కూలీలుగా, లాబ్ ఎటెండెంట్లగా బతుకుతున్నారు. మాల్వాలో అయితే ఊరొదిలి పోవడానికి వీల్లేదు. ఈ పరిస్థితుల్లో వామపక్షీయులు కొందరు మాల్వా ప్రాంతంలో కొందరు దళిత యువకులతో 2009లో జమీన్ ప్రాప్తి సంఘర్ష్ కమిటీ అని ఏర్పరచి, గ్రామంలో దళితులకై కేటాయించిన భూముల్లో సహకార పద్ధతిలో వ్యవసాయం చేయించడం మొదలుపెట్టారు. అది జాట్ శిఖ్కులకు కోపకారణమైంది. వారికి రాజకీయంగా ఉన్న పలుకుబడి కారణంగా రాజకీయ పక్షాలన్నీ యీ గొడవలను చూసీచూడనట్లుగా ఊరుకుంటున్నాయి.

ఇన్ని జరుగుతున్నా దళితులు సంఘటితంగా పోరాడటం లేదు. తక్కిన ఓటర్లందరూ ఎలా ఓటేస్తే అలాగే వేస్తున్నారు కానీ ప్రత్యేకంగా ఒక పార్టీని అభిమానించి, గెలిపించి, వారి ద్వారా తమ డిమాండ్లను సాధించుకోవటం లేదు. అసలు పంజాబ్ ఎన్నికలు కులాలవారీగా జరుగుతున్నాయా అనే అనుమానం వస్తుంది. గ్రామీణ జాట్ శిఖ్కుల్లో అకాలీ అభిమానులు ఎక్కువమంది ఉన్నారని, నగర హిందువుల్లో బిజెపి అభిమానులు ఎక్కువమంది ఉన్నారని విశ్లేషకులు అంటూ వుంటారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలను తారుమారు చేసేటంత స్థాయిలో ఆ అభిమానం వుందా అనే అనుమానం వస్తుంది, 2017 అసెంబ్లీ ఎన్నికల ఓటింగు సరళి చూస్తే! సిఎస్‌డిఎస్ సర్వే ప్రకారం 80 సీట్లు గెలిచిన కాంగ్రెసుకు వచ్చిన ఓట్లు 39%. జాట్ శిఖ్కుల్లో 28% దానికి వేశారు. అలాగే ఒబిసి శిఖ్కులు 37%, దళిత శిఖ్కులు 41%, హిందూ దళితులు 43%, దళితేతర హిందువులు 48% వేశారు. దీని ప్రకారం అన్ని వర్గాలలోనూ దాని బలం 28% నుంచి 48% మధ్యలో వుంది. ఏ వర్గం మీదా పూర్తిగా ఆధారపడలేదు.

అలాగే 16 సీట్లు గెలిచిన బిజెపి-అకాలీ కూటమికి వచ్చిన ఓట్లు 31%. జాట్ శిఖ్కుల్లో 37% ఒబిసి శిఖ్కులలో 32%, దళిత శిఖ్కులలో 34%, హిందూ దళితులలో 26%, దళితేతర హిందువులలో 22% వేశారు. 20 సీట్లు గెలిచిన ఆప్‌కి వచ్చిన ఓట్లు 24%. జాట్ శిఖ్కుల్లో 30%, ఒబిసి శిఖ్కులలో 26%, దళిత శిఖ్కులలో 19%, హిందూ దళితులలో 21%, దళితేతర హిందువులలో 23% వేశారు. అంకెలు యిలా వుండగా అన్ని పార్టీలకూ సడన్‌గా దళిత ఓట్లతో గెలిచేయగలమనే ఊహ పుట్టుకుని వచ్చింది. సంఖ్యాపరంగా ఎంతమంది వున్నా, ఉద్యమాల రూపంలో వారిని సమీకృతం చేసి, మూకుమ్మడిగా ఓటేయించ గలిగితే తప్ప రాజకీయపరంగా వారి బలం ప్రదర్శితం కాదు. ఏ రాష్ట్రం చూసినా సంఖ్యాపరంగా అధికంగా ఉన్న కులాల చేతిలో కాకుండా, కొన్ని మైనర్ కులాల చేతిలోనే రాజకీయాధికారం వుండడానికి కారణం యిదే!

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2022)

[email protected]