ఏం సెప్తిరి: బీజేపీకి మాత్రమే ఇది సాధ్యం!

ఏపీలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని రెచ్చిపోతున్నారు బీజేపీ నేతలు. తిరుపతిలో అధికార పార్టీని ఓడిస్తాం, ప్రతిపక్షానికి ప్రత్యామ్నాయం అవుతాం, వచ్చే ఎన్నికల నాటికి గద్దెనెక్కుతాం.. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని సీఎంగా ఎంపిక చేస్తాం..…

ఏపీలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని రెచ్చిపోతున్నారు బీజేపీ నేతలు. తిరుపతిలో అధికార పార్టీని ఓడిస్తాం, ప్రతిపక్షానికి ప్రత్యామ్నాయం అవుతాం, వచ్చే ఎన్నికల నాటికి గద్దెనెక్కుతాం.. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని సీఎంగా ఎంపిక చేస్తాం.. అంటూ ఓ రేంజ్ లో డబ్బా కొట్టుకుంటున్నారు. జగన్ సర్కారుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు.

కట్ చేస్తే.. ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలు ఏపీలోని జగన్ సర్కారుని ఆదర్శంగా తీసుకోవడం ఇక్కడ విచిత్రం. కర్నాటకలోని యడ్యూరప్ప ప్రభుత్వం, వైసీపీ అమలు చేస్తున్న సచివాలయ వ్యవస్థను యాజ్ ఇటీజ్ గా కాపీ కొట్టేందుకు సిద్దమైంది.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏపీలో సూపర్ హిట్ అయింది. అటు నిరుద్యోగ సమస్య తీరడం, ఇటు ప్రజలకు ఇంటి వద్దకే సేవలు అందుబాటులోకి రావడంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒకే పథకంతో రెండు సమస్యలు తీరిపోయాయి.

అంతే కాదు, సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక పథకాల అమలు తీరులో పారదర్శకత మెరుగైంది. అంతా ఆన్ లైన్ కావడంతో అవినీతికి తావు తగ్గింది. గ్రామస్తులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం ఆగిపోయింది, నెలల తరబడి సర్టిఫికెట్ల కోసం ఎదురు చూడటం కూడా తగ్గిపోయింది.

పొరుగున ఉన్న కర్నాటక ఈ వ్యవస్థను యాజ్ ఇటీజ్ గా తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇద్దరు ఐఏఏస్ ఆఫీసర్లతో కూడిన 10మంది కర్నాటక అధికారుల బృందం అనంతపురం జిల్లాలో పర్యటిస్తోంది. సచివాలయ ఉద్యోగులతో సమావేశమైన అధికారులు, జిల్లా అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. సచివాలయాల్లో అందుబాటులో ఉన్న సేవల వివరాలు తెలుసుకుని అవాక్కయ్యారు.

పొరుగు రాష్ట్రం కర్నాటక తెలుసుకున్న అసలు విషయాన్ని ఏపీలోని బీజేపీ తెలుసుకోలేకపోవడమే ఇక్కడ ఆశ్చర్యం. కేంద్రంలోని బీజేపీ అగ్ర నేతలు సైతం జగన్ సర్కారు పనితీరుని అభినందిస్తుంటే.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం ఇంకా బీరాలు పలుకుతూనే ఉన్నారు.

పొరుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాలే ఏపీలోని జగన్ సర్కారుని అనుసరిస్తుంటే.. ఇక ఏపీలో ఆ పార్టీతో ప్రజలకు పనేంటి? అక్కడి వారికి కూడా ఆదర్శంగా ఉన్న జగన్ ప్రభుత్వం ఏపీలో ఎప్పటికీ అధికారంలో ఉంటే తప్పేంటి?

కొసమెరుపు ఏంటంటే.. గ్రేటర్ ఎన్నికల్లో సైతం బీజేపీ, జగన్ ను ఫాలో అవుతోంది. రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో జగన్ పథకం ఉంది. గ్రేటర్ పరిథిలో ఆటోడ్రైవర్లకు తన మేనిఫెస్టోలో వరాలు ప్రకటించింది బీజేపీ. అ పథకం ప్రస్తుతం ఏపీలో అమల్లో ఉంది.

బాబుని వేటాడుతున్న భయం