కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాల్లో ఒకటి ఎల్జేపీ. ఇటీవలే మరణించిన దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ ఇది. ప్రస్తుతం ఆయన తనయుడు ఈ పార్టీకి సుప్రిమో. లోక్ సభ ఎన్నికల్లో బిహార్ లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీలు కలిసి పోటీ చేశాయి. ఎల్జేపీ ఆరుసీట్లను నెగ్గినట్టుగా ఉంది. అయితే బిహార్ అసెంబ్లీ లో మాత్రం ఈ పార్టీకి బలం అంతంత మాత్రమే!
ఇక ప్రస్తుత బిహార్ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే.. ఈ ఎన్నికల్లో కమలం పార్టీతో కాకుండా సోలోగా పోటీ చేస్తూ ఉంది ఎల్జేపీ. బీజేపీ-జేడీయూలు కలిసి పోటీ చేస్తూ ఉండగా, ఎల్జేపీ మాత్రం సోలోగా పోటీ చేస్తోంది.
ఆ పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసే సీట్లలో ఎల్జేపీ అభ్యర్థులను పెట్టడం లేదు! కేవలం జేడీయూ అభ్యర్థులు పోటీ చేసిన చోట మాత్రం ఎల్జేపీ తన పార్టీ అభ్యర్థులను సెట్ చేస్తోంది! బీజేపీపై ఇప్పటికీ ఎల్జేపీకి ప్రేమేనట. అయితే జేడీయూ అంటే మాత్రం పడదట!
ఒకవైపు బీజేపీ వాళ్లేమో తమకు అధికారం ఇస్తే.. జేడీయూ నేత నితీష్ కుమార్ ను బిహార్ కు సీఎంగా చేస్తామంటూ ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు ఉంది. ఎల్జేపీ అధికారంలోకి వస్తే మాత్రం నితీష్ కుమార్ ను జైలుకు పంపుతారట! ఈ మేరకు ఆ పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు.
ఈయన బీజేపీని పొడుగుతున్నారు. బీజేపీకి పోటీ పెట్టడం లేదు, బీజేపీ ప్రతిపాదిత సీఎం అభ్యర్థిని మాత్రం జైలుకు పంపుతారట! బీజేపీ మంచి పార్టీనే కానీ, బీజేపీ సీఎం చేస్తానంటున్న నితీష్ మాత్రం మంచోడు కాదంటూ చిరాగ్ పాశ్వాన్ దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు.
అయితే ఇదంతా డ్రామ అని, దళిత ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని.. ఎల్జేపీ బీజేపీతో ఉన్నా అవి ఈ కూటమికి పడవనే లెక్కలతో, ఆ పార్టీని సోలోగా పోటీ చేయించి దళిత ఓట్లు ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి పడకుండా ఎల్జేపీ రంగంలోకి దిగిందనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.