ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం, థియేటర్లలో సేఫ్టీ మెజర్మెంట్స్ వ్యవహారం, వీటిపై సినిమా వాళ్ల స్పందన.. ఇందుకు సంబంధించిన రచ్చపై మంత్రి పేర్నినాని స్పందించారు. సచివాలయంలో ప్రెస్ మీట్ లో ఈ రచ్చపై ఆయన స్పందించారు.
సినిమా హాళ్లపై తనిఖీల పై నాని స్పందిస్తూ.. గతంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబీటర్లతో సమావేశం సమయంలోనే.. థియేటర్లలో ఈ అంశంపై స్పందించామని, నిబంధనలు, ఫైర్ ఎన్వోసీలగురించి తాము అప్పుడే ప్రస్తావించినట్టుగా తెలిపారు. అయినప్పటికీ అనుమతులు తీసుకోని థియేటర్లపై చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో కక్ష సాధింపు ఏముందని మంత్రి ప్రశ్నించారు.
ఇప్పటి వరకూ థియేటర్లపై జరిపిన తనిఖీల గురించి స్పందిస్తూ.. మొత్తం నూటా ముప్పై థియేటర్లపై చర్యలు తీసుకున్నట్టుగా తెలిపారు. అత్యధికంగా చిత్తరులో ఇరవై నాలుగు, కృష్ణా జిల్లాలో పన్నెండు థియేటర్లు సీజ్ అయినట్టుగా మంత్రి తెలిపారు.
లైసెన్స్ లేని వాళ్లు ఇరవై రెండు థియేటర్లను మూసేసుకున్నారని, ఎనభై మూడు సీజ్ చేశారని, ఇరవై థియేటర్లకు ఫైన్ పడిందన్నారు. ఏప్రిల్ లో ఇచ్చిన జీవో గురించి ఇప్పుడు మూసివేసి నిరసనలు తెలుపుతున్నారా? అంటూ మంత్రి ఎద్దేవా చేశారు
సినిమా పరిశ్రమకు సంబంధించి ఏ సమస్యను అయినా వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కక్ష సాధింపు అంటూ కొంతమంది తమకు లేని ఉద్దేశాలను ఆపాదించడం ధర్మకం కాదని మంత్రి వ్యాఖ్యానించారు.
గతంలో సొంత బామ్మర్ది, కమ్ వియ్యంకుడు తీసిన సినిమాకు చంద్రబాబు రాయితీని ఇచ్చారని, అదే చిరంజీవి తీసిన సినిమాకు రాయితీ ఇవ్వలేదని.. తమకు అలాంటి తమపరబేధాలు కూడా ఉండవని అన్నారు. ఈ సందర్భంగా ఏపీలో టికెట్ల వ్యవహారంపై అనుచితంగా స్పందించిన నటుడు నాని, తమిళ నటుడు సిద్ధార్థ్ ల విషయంలో కూడా మంత్రి వ్యంగ్యంగా స్పందించారు.