మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు గురించి మార్చి 10న న్యూఢిల్లీలో దీక్ష చేస్తానని మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మహిళలకు చట్టసభలలో ప్రాతినిధ్యం పెంచే ఈ బిల్లు గురించి.. ఎంత ఎక్కువ మంది పోరాడినా సరే ఆహ్వానించదగిన పరిణామమే. దాని వలన ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి బిల్లు చట్టరూపం దాల్చే అవకాశం వస్తుంది.
కానీ, కల్వకుంట్ల కవిత ప్రకటించిన దీక్ష వెనుక చిత్తశుద్ధి ఉన్నదా? నిజంగా బిల్లును సాధించే ఉద్దేశంతోనే ఆ మాట చెబుతున్నారా? కేవలం రాజకీయ డ్రామాగా, ఇలాంటి దీక్షతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే కోరికతో దీక్షకు పూనుకుంటున్నారా అనేది అర్థం కాని సంగతి.
చట్టసభలలో మహిళలకు ప్రాతినిధ్యం సంగతి సరే, గెలిచిన వారికి ప్రాధాన్యం ఇచ్చే విషయంలో భారాస వైఖరి ఏమిటి? హఠాత్తుగా మహిళా సమాజం మీద ఆ పార్టీకి ప్రేమ ముంచుకొచ్చిందా? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఏర్పాటైన కెసిఆర్ క్యాబినెట్లో ఒక మహిళ కూడా లేదంటే.. అది యావత్తు తెలంగాణ సమాజానికే అవమానకరం కాదా? ఇవాళ మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని దీక్షకు పూనుకుంటున్న కల్వకుంట్ల కవిత ఆరోజు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు?
తన తండ్రిని బహిరంగంగా నిలదీయడానికి ధైర్యం చాలకపోవచ్చు.. కానీ, మహిళలను కూడా మనుషుల్లాగా గుర్తించమని, వారికి క్యాబినెట్లో చోటు కల్పించడం కనీస మర్యాద అని తన తండ్రికి ప్రైవేటుగా అయినా ఎందుకు చెప్పలేకపోయారు? మహిళా సమాజం మీద తన ప్రేమ గౌరవాలను.. ఆనాడు ఎక్కడ దాచుకున్నారు? ఇవన్నీ కూడా ఆమె దీక్ష నేపథ్యంలో మనకు ఎదురయ్యే ప్రశ్నలు!
తమ పార్టీ గెలిస్తే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లును చట్టం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా విస్పష్టంగా ప్రకటించింది. కల్వకుంట్ల కవిత వారి ప్రకటనలను గౌరవిస్తూ, వారు ఆ పని చేసేటట్లయితే కాంగ్రెసుకు జై కొడతామని అనగలదా? మహిళా బిల్లే ఆమె ప్రాధాన్యం అయితే.. ఆ విషయంలో కాంగ్రెస్కు అండగా నిలుస్తామని, కాంగ్రెసుతో కలిసి పోరాటం సాగిస్తామని చెప్పగలరా? అలాంటి ప్రకటన చేస్తే, తెలంగాణలో తమ పార్టీకి ఆత్మహత్యా సదృశం అవుతుందని ఆమెకు తెలియదా? అనే సందేహాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి.
అయినా 33% చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలని అడిగే ముందు, ఈ ఏడాదిలోనే జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో, తమ పార్టీ తరఫున 33 శాతం మంది మహిళలకు టికెట్లు ఇవ్వవచ్చు కదా. ఆ రకంగా తన తండ్రిని ఒప్పించవచ్చు కదా. అలాంటి పని భారాస చేయగలిగితే.. మహిళలకు చట్టసభల్లో మరింతగా ప్రవేశం కల్పించడం గురించి ఆ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నదని నమ్మవచ్చు. అలాంటి పని చేయనంతవరకు, ఇలాంటి నిరుపయోగమైన దీక్షలతో డ్రామా నడిపించాలంటే రక్తి కట్టదు.