ప్రభాస్..చరణ్..ఎన్టీఆర్..బన్నీ..రాజమౌళి సినిమా తరువాత మహేష్ అంతా కూడా బాలీవుడ్ లెవెల్ చూసుకుని డైరక్టర్లను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ ఓ సినిమా కొరటాల శివతో చేస్తున్నారు. అలాగే బన్నీ కూడా ఓ సినిమా త్రివిక్రమ్ తో చేస్తారు.
ఆ తరువాత సంగతేమిటి? భారీ కథ, భారీ కథనం, అన్ని ప్రాంతాలకు సరిపోయే కథ ఎంచుకుని తీయగలిగితే తప్ప త్రివిక్రమ్ లాంటి ‘పక్కా లోకల్’ డైరక్టర్లకు ఇక చాన్స్ లు కష్టం అవుతుంది. సినిమాలు దొరకచ్చు. కానీ హీరోలు దొరకడం అన్నది సమస్య.
మైథలాజికల్ సినిమాలు తీస్తే పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని త్రివిక్రమ్ షార్ట్ కట్ రూట్ ఆలోచన. నిజమే. కానీ మాస్ భారీ యాక్షన్ సినిమాల వైపు చూస్తున్న హీరోలు ఎవ్వరు రెడీగా వుంటారు ఇలాంటివి చేయడానికి. పైగా మల్టీస్టార్లు కావాలి వీటికి. అది మరీ కష్టం. ఇప్పుడున్న ట్రెండ్ ఇలా కంటిన్యూ అయితే 2024లో బన్నీతో త్రివిక్రమ్ సినిమా తరువాత మళ్లీ మరో హీరో దొరకాలి అంటే చాలా కష్టం.
అసలు తెలుగులో ఓ రేంజ్ డైరక్టర్లకు ఇక టాప్ హీరోలు దొరకరు. పండగకు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన బాబీ, గోపీచంద్ మలినేని కి అల్లు అర్జున్ చాన్స్ ఇవ్వలేదు. బోయపాటి, హరీష్ శంకర్ వుండనే వున్నారు. వారినీ కరుణించలేదు. బాలీవుడ్ లో జస్ట్ రెండో సినిమా చేస్తున్న సందీప్ వంగా వైపు దృష్టి పెట్టారు.
శంకర్ సినిమా తరువాత రామ్ చరణ్ ఏం చేస్తారు? ఎటు చూస్తారు? రాజమౌళి సినిమా తరువాత మహేష్ బాబు? ప్రభాస్ ఏవో ఈక్వేషన్లతో మారుతికి చాన్స్ ఇచ్చారు. అలాంటివి చాలా రేర్ గా జరుగుతాయి. ఓం రౌత్.. ప్రశాంత్ నీల్..నాగ్ అశ్విన్..సిద్దార్థ్ ఇలాంటి పేర్లతో చేస్తూ మారుతికి చాన్స్ దొరకడం అంటే చాలా అంటే చాలా అదృష్టమే. కానీ ఇలాంటి అదృష్టం అందరూ ఎక్స్ పెక్ట్ చేయగలిగేది కాదు.
ఒకటి రెండు ప్రొడక్షన్ హవుస్ లు వదిలేస్తే మన నిర్మాతలకు కూడా ఈ టాప్ హీరోలు ఇక దొరకరు. దర్శకులకే కాదు నిర్మాతలకు కూడా అదే సమస్య. కానీ నిర్మాతలకు కొంత వరకు చాన్స్ వుంటుంది. కానీ దర్శకులకు చాలా కష్టం.
మనకు మిగిలేది టాప్ సీనియర్ హీరోలు. లేదా మిడ్ రేంజ్ హీరోలు. అందరూ ఇక వారి వెంటే పడాలి. కానీ సెకెండ్ లైన్ లో వున్న హీరోలు కూడా ఇప్పుడు అంతా పాన్ ఇండియా అంటున్నారు. ఎటొచ్చీ వారికి డైరక్టర్లు మాత్రం మనవాళ్లే కాబట్టి ఓకె. లేదూ వాళ్లకీ చాన్స్ వస్తే బాలీవుడ్ లేదా అదర్ లాంగ్వేజ్ డైరక్టర్ల వైపు జంప్ అంటారు.
చూస్తుంటే రాబోయే ఒకటి రెండేళ్లలో టాలీవుడ్ లో చాలా మార్పులు వచ్చేలా వున్నాయి.