Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు

మూవీ రివ్యూ: ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు

చిత్రం: ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు
రేటింగ్: 1.75/5
తారాగణం: సొహేల్, మృణాళిని రవి, రాజేంద్ర ప్రసాద్, మీనా, సుర్య, హేమ, వరుణ్ సందేష్, రష్మీ గౌతం, సునీల్, ఆలి, అజయ్ ఘోష్, సప్తగిరి, ప్రవీణ్, పృధ్వి, రాజరవీంద్ర తదితరులు
కెమెరా: సి రాం ప్రసాద్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాత: కోనేరు కల్పన
కథ-స్క్రీన్ ప్లే-సంగీతం-దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి
విడుదల: మార్చ్ 3, 2023

ఎప్పుడో 2014 లో "యమలీల-2" అని తీసిన ఎస్వీ కృష్ణారెడ్డి మళ్లీ ఇన్నేళ్లకి "ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు" అంటూ ముందుకొచ్చారు. నేటి తరం వారికి ఆయన సినిమాలు తెలియకపోయినా 1990ల్లో ఈయన వైభవం చూసిన వాళ్లకి మాత్రం ఏదో ఒక ఆశ..మళ్ళీ ఆనాటి అనుభూతి దొరుకుతుందేమోనని. 

కథేంటంటే...విజయ్ (సొహేల్) సినీదర్శకుడిగా అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. హాసిని (మృణాలిని) ప్రేమలో పడతాడు. ఆమె ఒక పెద్ద ఆసామి అయిన ఆర్గానిక్ పంటలు పండించే వెంకటరమణ (రాజేంద్రప్రసాద్) కూతురు. విజయ్ కొండపల్లి బొమ్మలు చేసుకుని బతికే ఒక సామాన్యుడి కొడుకు. వీళ్లిదరి ప్రేమని వెంకటరమణ ఎలా ట్రీట్ చేస్తాడు? విజయ్ టాలెంట్ ఏమిటి? అతను మామ మనసు ఎలా గెలుచుకుంటాడనేది కథ. 

ఎస్వీ కృష్ణారెడ్డి కామెడీకి, సంగీతానికి పెట్టింది పేరు. ఇందులో మొదటి పాట "అల్లసాని వారి అల్లిక.." వినగానే ఆహా! అనిపిస్తుంది. అన్ని పాటలూ తన మార్కుతో అలాగే నిలబెట్టి ఉంటాడనే ఆశ కలుగుతుంది. కానీ మిగిలిన పాటలేవీ హత్తుకోవు. అంటే సంగీతంలో కూడా తన మార్క్ చూపించలేకపోయారు ఎస్వీకె. 

ఇక కామెడీ విషయానికొస్తే తీసినవారికి, చేసిన వారికి నవ్వొచ్చిందేమో కానీ చూసిన వాళ్లకి మాత్రం విసుగొస్తుంది. పేలని జోకుల మధ్య "అయితే చేపల పులుసు పెట్టేయమంటారా!" అంటూ హేమ రిపీట్ డైలాగ్, సెకండాఫులో రాజేంద్రప్రసాద్ మీద "అమలాపురం" అంటూ వినిపించే బీజీఎం, సప్తగిరి పెళ్లిచూపుల సీన్.. అన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ విసిగిస్తాయి. అజయ్ ఘోష్ ట్రాక్ ఒక్కటీ వినోదం లో ఉత్తుత్తి బ్యాంక్ సీక్వెన్స్ ని గుర్తు చేస్తూ కాస్త పర్వాలేదనిపించినా అది కూడా ఆశించిన స్థాయిలో లేక నిరాశపరుస్తుంది. 

దర్శకుడికి ఉన్న పరిచయాల వల్ల తెర మీద తారాగణమైతే నిండుగానే కనపడింది. అయితే అందులో అధికులు సింగిల్ డే కాల్షీట్ ఇచ్చిన వాళ్లే. వరుణ్ సందేష్, రష్మీ గౌతం ఇందులో హీరో హీరోయిన్స్ గా నటించారు. అసలు హీరో సొహేల్ దర్శకుడిగా వీళ్లని డైరెక్ట్ చేస్తాడన్నమాట. ఈ ట్రాక్ అంతా ఆర్జీవీ "అప్పల్రాజు" సినిమాని పోలి ఉంటుంది. 

కథానాయకుడు సొహేల్ బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయ్యాడు. నటన పరంగా ఎలా ఉన్నా అతని మీద ఫైట్స్ వంటివి పెట్టడం అతిగా ఉంది. ముఖపరిచయం సరిగా లేని హీరో మీద అంత హీరోయిజాన్ని సగటు ప్రేక్షకులు తట్టుకోలేరన్న సత్యాన్ని దర్శకులవారు విస్మరించారు. 

హీరోయిన్ మృణాలిని రవి హై వోల్టేజ్ నవ్వు మొహంతో ఆద్యంతం ఒకే తరహాలో ఉంది. రొటీన్ హీరోయిన్ పాత్రే తప్ప వేరియేషన్స్ చూపించడానికేమీ లేదు ఆమెకి. 

రాజేంద్ర ప్రసాద్ సింగిల్ కస్ట్యూం లో హీరోయిన్ తండ్రిగా నిండుగా కనిపించాడు. మీనా ఓకే. మిగిలిన తారాగణమంతా ఏదో అలా కనిపించి వెళ్తూ ఉంటారు. 

ఎంత గొప్ప దర్శకుడైనా కాలక్రమంలో ఔట్ డేటెడ్ అయిపోతారని మరొక సారి తేటతెల్లమయ్యింది. ఆ రోజుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలంటే ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండేవి. సకుటుంబసపరివారంగా చూసి హాయిగా ఆస్వాదించేలా ఉండేవి. "వినోదం" లాంటి సినిమాల్లోని కామెడీ ఇప్పటికీ యూట్యూబులో చూసే తెలుగు ప్రేక్షకులు అనేకం. కానీ అదేంటో ఆ స్పార్క్ ఇప్పుడు లేదు. చాలా పేలవమైన కథతో, అంతకంటే నీరసమైన స్క్రీన్ ప్లే తో.. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఒక పాట, ఒక ఫైట్, మళ్లీ ఒక సీన్, ఒక పాట...పద్ధతిలో సాగే నెరేషన్ ఎంత ఔట్ డేటెడ్ ఫార్ములానో వేరే చెప్పక్కర్లేదు. 

నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. కెమెరా వగైరాల పనితనం బాగుంది. "జుట్టి ఊడిపోయాక దువ్వెన్న దొరికింది" అని ఇందులో ప్రవీణ్ ఒక చోట అంటాడు. ఆ టైపులో టెక్నికల్ గా ఎన్ని దువ్వెన్నెలుంటే ఏం లాభం, కథ-కథనం అనే జుట్టు లేకుండా! అనిపిస్తుంది.  

క్లైమాక్స్ లో కళాత్మకకథాచిత్రానికి కమెర్షియల్ చిత్రానికి తేడా చెబుతూ ఒక డైలాగుంటుంది. ఇంతకీ ఈ "ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు" ఏ తరహా చిత్రమో తేలలేదు. ఎందుకంటే ఇందులో కళాత్మకకథ లేదు మొదటి రకం అనుకోవడానికి. అలాగని కాసులు రాలే లక్షణాలు కనిపించడం లేదు..కమెర్షియల్ సినిమా అనుకోవడానికి. 

బాటం లైన్: కాలం చెల్లిన మామ- కాసులు రాల్చని అల్లుడు

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా