మళ్లీ ఫ్రెండ్షిప్: ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ఇద్దరూ అప్రకటిత స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూనే ఉంది.  Advertisement జగన్ మీద విరుచుకుపడే పవన్ కల్యాణ్.. చాలా విషయాల్లో…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ఇద్దరూ అప్రకటిత స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నారని చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూనే ఉంది. 

జగన్ మీద విరుచుకుపడే పవన్ కల్యాణ్.. చాలా విషయాల్లో అందుకు మూలమైన చంద్రబాబునాయుడు పరిపాలన మీద మాత్రం సుతిమెత్తగా మాట్లాడుతూ రావడమే ఇందుకు ప్రబల నిదర్శనం. 

అయితే.. పైకి మాత్రం వీరిద్దరూ అస్సలు పరస్పర సంబంధంలేని రెండు వేర్వేరు పార్టీల నాయకులుగానే కనిపిస్తూ వస్తున్నారు. ఈ ముసుగు కూడా తొలగిపోనుంది. ఇద్దరూ ఒకే వేదికమీదికి రానున్నారని విశ్వసనీయ సమాచారం.

అమరావతినుంచి పాదయాత్ర చేసి తిరుమల దాకా వచ్చిన రైతులు.. 17వ తేదీన తిరుపతిలో బహిరంగసభ నిర్వహించాలని ముందునుంచి అనుకున్నారు. అయితే.. స్థానికంగా పోలీసులు వారికి అనుమతి ఇవ్వలేదు. 

శాంతి భద్రతల కారణాలతోపాటు, ఇటీవలి వరదల తాకిడికి తిరుపతి, పరిసర ప్రాంతాలు మొత్తం అస్తవ్యస్తం అయిపోయి ఉన్న నేపథ్యంలో.. పోలీసులు అనుమతులివ్వలేదు. అయితే.. బహిరంగ సభ నిర్వహణ కోసం రైతులు, వారి మద్దతు దారులు హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. 

మొత్తానికి 17వ తేదీ అమరావతి నుంచి వచ్చిన వారి బహిరంగ సభ జరగబోతోంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటలలోగా సభ పూర్తి కావాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ బహిరంగ సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రానున్నారు. ఆయన పర్యటన ఖరారైంది. ఉదయం 10 గంటలకే తిరుపతి చేరుకునే చంద్రబాబు.. రైతుల సభలో పాల్గొంటారని అధికారికంగా సమాచారం వచ్చింది. 

అయితే అనధికారికంగా తెలుస్తున్న దాన్ని బట్టి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. ఆయనను రప్పించడానికని అమరావతి యోధులు ప్రయత్నాలు ప్రారంభించారు. పవన్ కల్యాణ్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది.

బీజేపీ దూరంగా ఉన్నంత వరకు పవన్ కల్యాణ్ కూడా అమరావతి రైతుల పాదయాత్ర విషయంలో అంటీముట్టనట్టు వ్యవహరించారు. బీజేపీ అమిత్ షా హూంకరించిన తర్వాత బీజేపీ దళాలు యాత్రలోకి దిగాయి. పవన్ కూడా హడావుడిగా తమ పార్టీ వారిని పురమాయించారు. 

ఆయన స్వయంగా పాల్గొనాలని అనుకున్నారు గానీ.. నాదెండ్ల మనోహర్ తో సరిపెట్టారు. అయితే అదంతా కూడా మొక్కుబడి మద్దతుగానే సాగిపోయింది. అమరావతికి నిజంగా మద్దతిచ్చినట్టు కనిపించాలంటే బహిరంగసభకు వెళ్లడమే మార్గమని.. పవన్ భావిస్తున్నట్టు సమాచారం. 

పాదయాత్ర చేస్తున్న అమరావతి వాసులు కూడా పవన్ రాకను కోరుకుంటున్నారు. తిరుపతిలోని జనసేన పార్టీ  నాయకుల ద్వారా విన్నపాలు పంపుతున్నట్టు తెలుస్తోంది.

ఏదేమైనా.. చంద్రబాబుతో కలిసి ఒకే వేదికను పంచుకోడానికి పవన్ కల్యాణ్ ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో.. ఈవేదికమీద వారు కలిస్తే.. అది రేపటి పొత్తుకు శ్రీకారం అవుతుంది.