సంక్రాంతి సినిమాల వ్యవహారం ఇంకా డైలామాలోనే వుంది. మల్టీస్టారర్, పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల పక్కా. అందులో సందేహం లేదు. అలాగే బాహుబలి ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ కూడా గ్యారంటీ. అది కూడా వాయిదా పడదు.
ఇక మిగిలింది కేవలం భీమ్లా నాయక్ మాత్రమే. ఈ సినిమా వాయిదా పడితే నాగార్జున బంగార్రాజు రంగంలోకి వస్తుంది. అది కాదు విషయం. అసలు భీమ్లా నాయక్ వాయిదా పడుతుందా? పడదా? అనేదే. భీమ్లా నాయక్ విడుదల అన్నది ఏ సినిమాకూ మంచిది కాదు.
అటు ఆర్ఆర్ఆర్ కైనా, ఇటు రాధేశ్యామ్ కు అయినా, ఆఖరికి భీమ్లా నాయక్ కు అయినా. సోలోగా వస్తే వచ్చే అడ్వాన్స్ లు కావచ్చు, కలెక్షన్లు కావచ్చు, దొరికే థియేటర్లు కావచ్చు. అదంతా వేరు. ఇప్పుడు ఇన్ని సినిమాల మధ్య వస్తే ఈ లెక్కలు అన్నీ మారిపోతాయి. ఇది కేవలం భీమ్లా నాయక్ కు మాత్రమే కాదు మిగిలిన రెండింటికీ కూడా.
ముఖ్యంగా రాధేశ్యామ్ క్లాస్ సినిమా. భీమ్లా మాస్ సినిమా. ఆ తేడా ఆ ఎఫెక్ట్ వుంటుంది. ఆర్ఆర్ఆర్ కాస్త ముందుగా వస్తుంది కనుక ఎఫెక్ట్ తక్కువ వుంటుంది. అందుకే ఇండస్ట్రీ మొత్తం భీమ్లా నాయక్ నిర్మాతల మీద, దర్శకుడు త్రివిక్రమ్ మీద విపరీతమైన ప్రెజర్ పెడుతోంది. వాళ్లు కూడా దాదాపు వాయిదాకు సుముఖంగానే వున్నారు.
కానీ హీరో పవన్ కళ్యాణ్ మాత్రం ససేమిరా అని ఓ సారి చెప్పేసారు. ఇప్పుడు మళ్లీ వెళ్లి అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు. వాయిదా కోసం హీరొను ఎలా అడగాలి? అడిగితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఇప్పుడు క్వశ్చనుగా వుంది.
ఏం జరిగినా ఈ నెల 21, 22 లోగా జరగాలి. ఎందుకంటే అ తరువాత పవన్ ఇక అందుబాటులో వుండరు. రష్యా వెళ్లిపోతారు. మళ్లీ ఫస్ట్ వీక్ లో కానీ రారు. అందువల్ల భీమ్లా నాయక్ వాయిదా వుంటుందా? వుండదా? అన్నది 21 లోగా తేలిపోతుంది.