ఇంత కాలం ప్రభుత్వాలు, న్యాయస్థానాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని చూశాం. ఇరు వైపుల నుంచి మాటకు మాట అనుకోవడం విన్నాం. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా జస్టిస్ చంద్రు వ్యాఖ్యలతో కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం వర్సెస్ హైకోర్టు అనే దశ నుంచి న్యాయస్థానంతో న్యాయమూర్తి ఢీకొనే వరకూ పరిస్థితులు దారి తీయడం సర్వత్రా చర్చకు దారి తీసింది.
ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు కార్నర్ చేస్తోందని, అలాగే సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించడం, మూడు రాజధానుల విచారణలో భాగంగా త్రిసభ్య ధర్మాసనంలో అమరావతి ఇంటి స్థలాలున్న ఇద్దరు న్యాయమూర్తులున్నారని, విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం విన్నవించడాన్ని జస్టిస్ చంద్రు ప్రధానం ప్రస్తావించారు. ఇలాంటి ధోరణుల వల్ల న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఏపీ హైకోర్టు వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా మూడు రాజధానుల బిల్లులనే వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని జస్టిస్ చంద్రు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశ వ్యాప్తంగా జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు కలకలం రేపాయి. జస్టిస్ చంద్రు ఘాటు విమర్శలపై ఏపీ హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, అలాగే జస్టిస్ బట్టు దేవానంద్ వేర్వేరు వ్యాజ్యాల విచారణలో భాగంగా జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను తప్పు పట్టారు. జస్టిస్ చంద్రుపై కఠిన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మాట్లాడుతూ కొంత మంది జ్యుడిషియల్ సెలబ్రిటీలు లైమ్‌లైట్‌లో వుండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని అన్నారు. అలాంటి వెలుగులని ఆపేస్తామని ఆయన హెచ్చరించారు. వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి, వచ్చిన పని చూసుకుని వెళ్లకుండా, ఏపీ హైకోర్టుపై విమర్శలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఇక జస్టిస్ బట్టు దేవానంద్ తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు. గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు సీఎం జగన్ చేసిన ఫిర్యాదులో జస్టిస్ బట్టు పేరు లేదు. జస్టిస్ బడ్డు దేవానంద్‌కు మంచి పేరుంది. ఆయన జస్టిస్ దేవానంద్ విమర్శలపై స్పందించడం గమనార్హం. జస్టిస్ చంద్రుపై ఇంతకాలం ఉన్న గౌరవం పోయిందన్నారు. జస్టిస్ బట్టు ఆగ్రహంలో కొంత న్యాయం ఉంది. హైకోర్టు మొత్తాన్ని నిందిస్తూ వ్యాఖ్యలు చేయడమేమిటనేది ఆయన ప్రశ్న.
కొన్ని ఘటనలు, కొందరు న్యాయమూర్తులపై అభ్యంతరం ఉంటే ఆ విషయం మేరకే పరిమితమై పోరాలనేది జస్టిస్ బట్టు ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా హైకోర్టు మొత్తంపై నింద మోపడం సరికాదందనేది ఆయన వాదన. ‘జై భీమ్’ సినిమాలో న్యాయవాదిగా కథా నాయ కుడి పాత్ర చూశాక.. జస్టిస్ చంద్రుపై గౌరవం పెరిగిందన్నారు.
విజయవాడ వచ్చి ఏపీ హైకోర్టుపై చేసిన వ్యాఖ్యలతో ఆయనపై గౌరవం పోయిందని జస్టిస్ బట్టు దేవానంద్ ఘాటుగా స్పందించారు. ఇంకా ఆయనపై చర్య తీసుకోవాలని చీఫ్ జస్టిస్‌కు లేఖ రాద్దామనుకున్నానని, కానీ జస్టిస్ చంద్రు సామాజిక నేపథ్యం, సమాజానికి చేసిన న్యాయ సేవ, వయసు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు జస్టిస్ దేవానంద్ అన్నారు.
జస్టిస్ చంద్రు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో, ప్రత్యేకంగా సదరు న్యాయమూర్తులపై నేరుగా విమర్శలు చేసి ఉంటే బాగుండేదని, అలా కాకుండా మొత్తం ఏపీ హైకోర్టుపైనే వ్యాఖ్యానించడంపై బాధ పడ్డారని అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా చేయని తప్పునకు తనలాంటి న్యాయమూర్తులు కూడా నిందలు పడాల్సి వస్తోందనేది జస్టిస్ బట్టు దేవానంద్ ఆవేదనలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.