ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అమల్లో ఉన్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం మరోసారి చర్చలోకి వచ్చింది. ఈ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించాలంటూ ఇరోమ్ షర్మిల సుదీర్ట కాలం పాటు నిరాహార దీక్షను చేశారు. ఆమె చేసిన దీక్ష ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వలేదు. రాజకీయంగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 90. తద్వారా ఆ ఉద్యమం నుంచి ఆమె వైదొలిగారు. అయితే ఆ చట్టం ఎంత ప్రమాదకరమైనదో తాజాగా నాగాలాండ్ లో జరిగిన ఘాతుకం దేశానికి తెలియ చెప్పింది.
17 మంది అమాయకులు సైన్యం కాల్పులకు బలయ్యారు. పనులు చేసుకుని ఇంటికి వెళుతున్న కార్మికులను ఉగ్రవాదులు అనే అనుమానంతో ఏకంగా కాల్చి చంపేసింది సైన్యం. మరి ఉగ్రవాదులు అయితే.. వారి వైపు నుంచి ఏ ప్రతిఘటనో మొదట రావాల్సింది కదా.
వారి వద్ద ఎలాంటి ఆయుధాలూ లేవని స్పష్టం అవుతోంది. మరి వారిని ఏ లెక్కన ఉగ్రవాదులుగా అనుమానించారు? ఇది సామాన్యుడికి తీరని సందేహం. అయితే సైన్యానికి ఇవన్నీ అవసరం లేదు. అక్కడ అమల్లో ఉన్న చట్టం ప్రకారం.. వారికి అనుమానం వస్తే చాలు ఇట్టే అరెస్టు చేయొచ్చు. ముందుస్తు హెచ్చరికలు జారీ చేసి కాల్చి చంపొచ్చు! అయినా అడిగే వారు ఉండరు.
ఎంత చట్టం ఉంటే.. మాత్రం మరీ ఇలా నిరాయుధులను, పనులు చేసుకునే కార్మికులను కాల్చి చంపడానికి మించిన ఘాతుకం ఉండదు. వారేమీ బంగ్లా నుంచి వచ్చిన వారో, ఖలిస్తాన్ మూలాలున్న వారో కాదు. పొట్ట కూటి కోసం పని చేసుకునే భారతీయులు. ఈ ప్రస్తావన ఎందుకంటే.. వారిపై ఉగ్రవాద ముద్ర వేయడానికి సైన్యం కన్నా ముందు వాట్సాప్ యూనివర్సిటీ పని మొదలుపెడుతుంది కాబట్టి.
ఇక ఇదే సమయంలో మరో విషయం కూడా ప్రస్తావనకు వస్తుంది. అదే బీఎస్ఎఫ్ పరిధిని విస్తరించాలంటూ ఈ మధ్యనే మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికార పరిధిని పెంచాలనే ఈ నిర్ణయం పట్ల పంజాబ్ నుంచి వ్యతిరేకత రాలేదు కానీ, బెంగాల్ నుంచి మాత్రం వ్యతిరేకత వచ్చింది. ఈ నిర్ణయాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకించారు.
బీఎస్ఎఫ్ పరిధిని దేశం లోపలికి కొన్ని కిలోమీటర్ల పాటు విస్తరించి, అక్కడ పోలీసుల జోక్యం, రాష్ట్ర ప్రభుత్వాల పరిధి కన్నా… బీఎస్ఎఫ్ పరిధినే పెంచాలనే నిర్ణయాన్ని మమత తప్పు పట్టారు. యథారీతిన భక్తులు విరుచుకుపడ్డారు. మమతను దేశద్రోహి అనేంత వరకూ వెళ్లారు! ఈ కాలంలో ముద్రలు వేసేయడం చాలా సులువు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశభద్రత విషయంలో రాజీ పడుతుందా? సైన్యానికి ప్రత్యేక అధికారాలు అనేది దేశభక్తి అనుకునే మూర్ఖపుమందకు ఏమీ చెప్పలేం.
ఎంత సైన్యం అయినా.. దానికీ పరిమితులు ఉండాలి, ఉంటాయి. ఈ అధికార పరిధి పెరిగినంతా.. దాని కింద నలిగే పౌర సమాజంలో వ్యతిరేకత వస్తుంది. ఆ ఉక్కుపాదం కింద నలిగే వారికి తప్ప వేరే వాళ్లకు ఆ నొప్పి తెలియకపోవచ్చు. నక్సలైట్ల, పోలీసుల మధ్య నలిగే ఏజెన్సీ ప్రజల కష్టాలు కూడా ఇలాంటివే. ఇలాంటి చోట పోలీసులకు ప్రత్యేక అధికారాలు పరిమితమే కాబట్టి.. ఇవి మీడియాకు ఎక్కుతుంటాయి.
ఈ ఘటనలో ముందుగా సైన్యం కొంతమందిని కాల్చి చంపగా, ఆ ఘటన గురించి తెలిసి స్థానికులు భగ్గుమన్నారు. సైనికులపై తిరగబడ్డారు. వారిని నియంత్రించడానికి మళ్లీ కాల్పులు జరిపింది సైన్యం. దీంతో మొత్తం మృతులు 17కు చేరారు. ఒక సైనికుడిని స్థానికులు చంపారని సైన్యం ప్రకటించుకుంది. అయితే మొదట నిర్దాక్షిణ్యంగా ఆరేడు మంది అమాయకులను కాల్చి చంపింది సైన్యం. ఆ తర్వాత తిరబడిన వారిని సంహరించడానికి కూడా ఏమాత్రం వెనుకాడకపోవడం గమనార్హం! అన్నింటికి సమాధానం కాల్పులేనా?