టైటిల్: స్కైలాబ్
రేటింగ్: 2/5
తారాగణం: సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, నారాయణరావు, తులసి, సుబ్బరాయ శర్మ, తదితరులు
కెమెరా: ఆదిత్య జవ్వాది
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
సంగీతం: ప్రశాంత్ విహారి
నిర్మాత: పృథ్వి పిన్నమరాజు
దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు
విడుదల తేదీ: 4 డిసెంబర్ 2021
1979లో స్కైలాబ్ నేలమీద పడబోతోందన్న వార్త పెద్ద సంచలనం. దాని నేపథ్యంలో ఒక తెలంగాణా పల్లెటూరి కథ అనగానే సరదా పుట్టడం సహజం.
పైగా పోస్టర్లో రాహుల్ రామకృష్ణ దర్శమివ్వడంతో జాతిరత్నాలు లాగ కామెడీగా ఉంటుందన్న భ్రమలు కలిగాయి. దానికి తోడు నిత్యామీనన్ నటించడమే కాకుండా నిర్మాణంలో కూడా పాలు పంచుకోవడం, సత్యదేవ్ లాంటి ప్రతిభావంతుడైన నటుడు కథానాయకుడిగా నటించడం వంటి కారణాల వల్ల అంచనాలు ఏర్పడ్డాయి.
1979లో స్కైలాబ్ ఊరి మీద పడుతుందని అప్పట్లో ప్రతి ఊళ్లోనూ కలకలం ఏర్పడిన సంగతి అప్పటి జనాలకి తెలుసు.
ఎలాగో రెండు మూడు వారాల్లో పోతాం కదా అనే భ్రమలో చాలామంది ఆస్తులమ్మేసుకోవడం, దానాలు చేసేయడం, రకరకాల తీరని కోర్కెలు తీర్చేసుకోవడం, ఎవర్నైనా తిట్టాలనుకుంటే భయాన్ని పక్కనబెట్టి తిట్టేయడం, పెరట్లో ఉన్న కోళ్లని మేకల్ని కోసుకు తినేయడం, రైతులు పొలం పనులకు వెళ్లకపోవడం, చాలమంది తాగి పొడుకోవడం లాంటివి చేసారు.
చివరికి స్కైలాబ్ సముద్రంలో పడడంతో కంగారులో చేసిన తప్పులకి నాలుక్కరుచుకున్నారు. కొందరు ఆస్తులు పోయి ఏడుస్తూ కూర్చున్నారు.
నిజానికి ఈ “స్కైలాబ్” సినిమాలో ఇలాంటివన్నీ పెట్టి ఫక్తు కామెడీ నడిపిస్తారని ఆశించారు ప్రేక్షకులు. కానీ ఇవేవీ లేకుండా నీరసంగా నడుస్తుంటుంది.
సినిమా మొదటి సీన్లోనే స్కైలాబ్ ప్రస్తావన వచ్చినా ఇంటర్వల్ దాకా సంబంధం లేని ఒక పల్లెటూరి కథ నడుస్తుంది. ఇంటర్వల్లో గానీ ఆ ఊరిజనాలకి స్కైలాబ్ నేలమీద పడబోతోందన్న సంగతి తెలియదు. అంటే ప్రధమార్థమంతా అసలు కథకి లీడ్ అన్నమాట.
పోనీ ద్వితీయార్థంలో స్కైలాబ్ కథ ఉందా అంటే, లేనట్టే ఉంది. ఊళ్లో ఒక్కడు కూడా సరిగ్గా భయపడినట్టు కనపడడు.
సత్యం శంకరమంచి రాసిన “అమరావతి కథలు” లో “వరద” అనే కథ ఒకటుంటుంది. ఊళ్లో అగ్రకులం, నిమ్నకులం, అంటరానితనం లాంటివి ఎన్నున్నా వరదలొచ్చినప్పుడు మాత్రం పైకులం వాడు కింద కులం వాడిని బాగానే చేరదీస్తాడు. అవసరార్ధం వచ్చిన మార్పు కొంతా, వైరాగ్యం కొంతా అందులో ధ్వనిస్తుంది. మళ్లీ వరదవెళ్లిపోగానే ఆ అసమానతలు అలాగే కొనసాగుతాయి. అటువంటి నేపథ్యంతో ఏదైనా ముగింపునివ్వబోతున్నాడేమో దర్శకుడు అనే ఆలోచన కూడా వస్తుంది. కానీ అలాంటిదేం లేదు.
సరదాగా నడపాల్సిన కథని అర్థం పర్థం లేకుండా నడిపాడు. పేపర్ మీద చదివినా గందరగోళంగా ఉండి ఏ ఏమోషనూ కలగని ఈ కథని తెరకెలా ఎక్కించారో అర్థం కాదు.
పోనీ ఇది ఓటీటీకి బాగుంటుందా అంటే అక్కడ ఇంకా పకడ్బందీగా నడపాలి స్క్రీన్ ప్లే ని కానీ, కథని కానీ. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ ఎక్కువుండే హాల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల మనసులో హాహాకారాలు పుట్టిస్తుంది.
ఇక ఓటీటీలో అయితే డైవెర్ట్ అయిపోవడం ఖాయం. అయితే ఉన్నంతలో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసుకునే వెసులు బాటుంటుంది. సినిమా బాలేదన్న చర్చకూడా పెద్దగా జరగదు. సినిమాహాల్లోకి వస్తేనే ఈ విమర్శలు ఎక్కువగా వినిపించేది.
కెమెరా పనితీరు, ఆర్ట్ వర్క్ లాంటి సాంకేతిక విలువలు బాగున్నాయి. 1979 నాటి పీరియడ్ ని పునఃసృష్టించడంలో ఆర్ట్ డైరక్టర్ కృషి కనపడుతుంది.
చాలాకాలం తర్వాత నారాయణరావు హీరోయిన్ తండ్రిగా తెరమీద కనిపించారు. పాత్రకి న్యాయం చేసారు. తల్లిపాత్రలో తులసి కూడా పర్వాలేదు. స్క్రిప్ట్, డయాలాగ్ నీరసంగా ఉండడంతో ఈ నటీనటుల ప్రతిభాప్రదర్శనకి చోటు లేకుండా పోయింది.
సత్యదేవ్ కూడా ఏదో ఉన్నాడంటే ఉన్నాడన్నట్టు ఉంది.
రాహుల్ రామకృష్ణ ఒకటి రెండు సన్నివేశాల్లో బాగా చేసాడు.
నిత్యామీనన్ ఓకే. కానీ ఆమె పాత్ర ఏ రకంగానూ కూడా ఎమోషన్ పండించదు.
సుబ్బరాయశర్మ పాత్ర ఏమిటో, అందులో దర్శకుడు ఫీలైన భావోద్వేగం ఏమిటో కూడా తేటతెల్లమవదు.
కామెడీగా ఉంటుందనుకున్న సినిమా నీరసంగా, నిస్పృహగా ఎటు వెళ్లి ఎక్కడాగుతుందో తెలియకుండా సా…గితే ఎలా ఉంటుంది? ఈ “స్కైలాబ్” సినిమాలా ఉంటుంది.
బాటం లైన్: స్కైలాబ్- ప్రేక్షకుల నెత్తిన పడింది