టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును తన పేరిట కూడా లిఖించుకున్నాడు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్. ఇండియా, న్యూజిలాండ్ ల మధ్యన జరుగుతున్న రెండు టెస్టులో నిన్న నాలుగు వికెట్లను తీసిన అజాజ్ .. రెండో రోజు మిగిలిన ఆరు వికెట్లను కూడా తీసి.. ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లను సాధించిన మూడో బౌలర్ గా నిలిచాడు.
జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేల తర్వాత ఈ తరహా ప్రదర్శన చేసిన అరుదైన బౌలర్ గా అజాజ్ పటేల్ నిలుస్తున్నాడు. న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్ లోని పేస్, స్పిన్ బౌలర్లెవ్వరూ కనీసం వికెట్ సాధించలేకపోయిన పిచ్ మీద అజాజ్ అద్భుతమైన ఫామ్ తో పది వికెట్లను సాధించాడు. భారత బ్యాటింగ్ లైనప్ ను ఒంటి చేత్తో పెవిలియన్ కు పంపిన ఘనతను సాధించుకున్నాడు.
అజాజ్ ప్రదర్శన ఎక్కవసేపు న్యూజిలాండ్ జట్టుకు ఆనందాన్ని కలిగించలేదు. భారత మూడు వందల ఇరవై ఐదు పరుగులకు ఆలౌట్ చేసిన న్యూజిలాండ్ ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించి త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. 38 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది కివీస్. భారత పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లను తీయగా అశ్విన్, అక్షర్, జయంత్ యాదవ్ లు తలా ఒక వికెట్ తీశారు. భారత బౌలర్ల దూకుడుతో కివీస్ బ్యాట్స్ మెన్ బంతిని టచ్ చేయడానికి కూడా భయపడేలా బ్యాటింగ్ సాగుతూ ఉంది.
రెండు రోజు టీ సమయానికే ఈ టెస్టుపై భారత జట్టు పట్టు బిగించింది. తొలి టెస్టును చివరి వికెట్ సాయంతో డ్రాగా ముగించుకున్న న్యూజిలాండ్ కు ఈ మ్యాచ్ లో అలాంటి డ్రా కూడా తేలికగా కనిపించడం లేదు.