సినిమాల్లో నటించే వారి పిల్లలకు తెలిసీ తెలియని దశలో ఏర్పడే ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నటి సారా అలీఖాన్ చెబుతున్న తన చిన్ననాటి విషయాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. సారా తండ్రి సైఫ్, తల్లి అమృతాసింగ్ ఇద్దరూ నటులే అని వేరే చెప్పనక్కర్లేదు. చిన్నతనంలో వారు నటించిన సినిమాలను చూసి.. వారు నిజంగా అతడి నెగిటివ్ మనుషులని తను అనుకున్నట్టుగా సారా ఇప్పుడు చెబుతోంది. ఒక మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా స్పందిస్తూ.. 2004-05 సమయంలో తన మానసిక స్థితి గురించి వివరించింది.
ఆ సమయంలో సైఫ్ సినిమా ఓంకారా, దాని కన్నా కొంత ముందు అమృతా సింగ్ నటించిన కల్ యుగ్ సినిమాలు విడుదల అయ్యాయి. ఈ సినిమాల్లో వారు వేర్వేరుగా నెగిటివ్ రోల్స్ నే చేశారు. షేక్స్పియర్ నాటకం ఒథెల్లో ఆధారంగా ఓంకారా వచ్చింది. అందులో సైఫ్ నెగిటివ్ రోల్ చేశాడు. పాత్రోచితంగా చాలా బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటాడు.
ఇక కల్ యుగ్ సినిమాలో అమృతాసింగ్ ది ఒక పోర్న్ సైట్ ఓనర్ పాత్ర. విదేశంలో ఉంటూ.. పోర్న్ సైట్ ను నడపడానికి అనేక మంది అమాయకులను బలి చేసే పాత్రలో అమృతాసింగ్ నటించింది. ఆ రెండు సినిమాలూ విడుదలయ్యే సమయానికి సారా వయసు తొమ్మిది, పదేళ్లు ఉంటాయి.
ఆ వయసులో ఆ సినిమాలు చూసినప్పుడు.. తన తల్లిదండ్రులు నిజంగానే ఆ సినిమాల్లో కనిపించే లాంటి వారేమో అని సారా అమాయకంగా అనుకుందట. వారు ఆ సినిమాల్లో కనిపించినంత చెడ్డ వాళ్లేమో అని భయపడిందట. ఇలా తన తల్లిదండ్రులను తెరపై చూడటం తనలో కలిగించిన భావనను సారా వివరించి చెప్పింది. అయితే ఆ భ్రమలన్నీ తర్వాతి కాలంలో తొలగిపోయాయని.. వారితో తన సాన్నిహిత్యం అంతులేనిదని సారా చెప్పింది.