భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్‌కు కోపం వచ్చింది. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పేలవమైన ఆట తీరుపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్, న్యూజిలాండ్ టీంలతో కీలక మ్యాచ్‌లలో టీమిండియా ఘోరంగా ఓడిపోవడంపై భారత క్రీడాభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.
క్రికెట్ కూన ఆప్ఘనిస్తాన్‌పై టీమిండియా ప్రతాపం చూపడం విశేషం. ఇదిలా ఉండగా క్రీడాభిమానుల ఆగ్రహం కపిల్‌దేవ్ మాటల్లో ప్రతిబింబించింది. ఈ సందర్భంగా ఆయన బీసీసీఐకి కీలక సూచనలు చేశారు. ఆటగాళ్ల భవిష్యత్‌పై సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ముందుగా సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టాలని నిర్మొహమాటంగా చెప్పారాయన.
ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందా అనే విషయంపై సెలెక్టర్లు దృష్టి పెట్టాలని కోరారు. ఎందుకంటే తర్వాతి తరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశాలపై దృష్టి సారించాలని విన్నవించారు.
ఒకవేళ యువ ఆటగాళ్లు ఓడినా నష్టమేమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఓడిపోయినా అనుభవం సంపాదిస్తారని ఆయన చెప్పడం గమనార్హం. పెద్ద ఆటగాళ్లు చెత్తగా ఆడుతుంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీసీసీఐని ఆయన హెచ్చరించారు.
కపిల్ అభిప్రాయాలపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కపిల్‌దేవ్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని పలువురు బీసీసీఐకి సూచిస్తుండడం విశేషం.