ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాన్ని ఓడించడానికి అవకాశాలను వెదుక్కొంటూ ఉంటాయి. ఎన్నికలు వస్తే తమ సత్తా చూపిస్తామంటూ ఉంటాయి. ఏపీలో కూడా ప్రతిపక్షాలు ఈ బీరాలే పలుకుతుంటాయి కానీ, తీరా ఎన్నికలు వస్తే మాత్రం ఇప్పుడు ఇవెందుకు వచ్చాయన్నట్టుగా మారుతుంటుంది పరిస్థితి!
ఏపీలో ఇప్పుడు పెండింగ్ లో ని మున్సిపాలిటీ, జడ్పీ ఎన్నికల వ్యవహారం ఇలానే మారింది. ఇప్పుడు సాగుతున్న ఎన్నికల ప్రక్రియలో కొన్ని ఆసక్తిదాయకమైన మున్సిపాలిటీలు ఉండనే ఉన్నాయి. అక్కడ ఫలితాల గురించి అంతా ఆసక్తిగా గమనిస్తారు. జరుగుతున్నది తక్కువ మున్సిపాలిటీలకే అయినా, ఈ ఎన్నికల ఫలితాలు కూడా రాష్ట్ర రాజకీయంలో చర్చగా మారడం ఖాయం.
ఇలాంటి నేపథ్యంలో టీడీపీ, ఆ పార్టీతో పాటు జనసేనలు తలపట్టుకున్నట్టుగా కనిపిస్తాయి. తమ సభలు, సమావేశాల్లో టీడీపీ అధినేత, జనసేన అధిపతి.. ఒక రేంజ్ లో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తమ చేతుల్లోకి అధికారాన్ని పువ్వుల్లో పెట్టి అప్పగిస్తారన్నట్టుగా సినిమా కథలు చెబుతూ ఉంటారు!
చంద్రబాబు అయితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది గాలివాటం విజయం అని అనేక సార్లు వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో ఏదో గాలివాటంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటూ, ప్రజల తీర్పును కూడా తక్కువ చేశారు అనేక సార్లు. మరి గాలివాటం పార్టీని ఓడించడం అంత కష్టమా? అప్పుడంటే ఏదో గాలికి గెలిచారు కదా.. మరి స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం ఎందుకు తన సత్తా చూపలేకపోయింది? అంటే ఇప్పటి వరకూ ఆ ప్రశ్నకు సమాధానం లేదు!
ఇక ఇంకో కామెడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అదో విజయమా? అంటూ చంద్రన్న వీరావేశంగా ప్రశ్నించడం! గెలిస్తే.. గాలికి గెలిచారు అనడం, మీరెందుకు ఓడారు అంటే.. వాళ్లదో విజయమా? అని ప్రశ్నించడం! ఇదీ చంద్రబాబు తీరు. ఈ మాటలతో ఇంకెన్నాళ్లు పబ్బం గడుపుతారు? అనే చర్చ ప్రజల్లో కూడా జరుగుతోంది.
ఈ కహానీలకు క్లైమాక్స్ టైమ్ వచ్చినట్టుగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పెండింగ్ స్థానాల ఎన్నికల్లో కూడా టీడీపీ ఉనికిని చాటుకోకుంటే.. ఆ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైనట్టే అనుకోవాలి. ప్రత్యేకించి చంద్రబాబుకు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ పీకల మీదకు వచ్చినట్టుగా ఉంది. అక్కడ గనుక టీడీపీ బోల్తా పడితే, ఇంకెన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా టీడీపీ రాష్ట్రం మొత్తం కూడా విశ్వాసాన్ని ప్రోది చేసుకోవడం అతి కష్టంగా మారుతుంది.