గత ఏడాదిన్నర కాలంలో లీటర్ పెట్రోల్ పై పెరిగిన ధర అక్షరాలా నలభై రూపాయల వరకూ ఉంది! ప్రస్తుతం పెట్రోల్ ధర వివిధ రాష్ట్రాల్లో సగటున 115 రూపాయల వరకూ ఉండగా, ఏడాదిన్నర కిందట లీటర్ పెట్రోల్ 75 రూపాయల స్థాయిలో లభించేది. కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాకా.. రోజువారీగా పెట్రోల్ ధర ఆకాశానికి అంటుతూ వచ్చింది.
కేంద్రంలో తాము ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులూ.. పెట్రో ధరల పెంపును తీవ్రంగా నిరసించిన నరేంద్రమోడీ, తనే ప్రధానమంత్రి అయ్యాకా.. పెట్రో ఉత్పత్తుల ధరలను రికార్డు స్థాయికి, ఆల్ టైమ్ హై రేంజ్ కు తీసుకెళ్లి తనను పీఎంను చేసిన ప్రజల రుణం తీర్చుకుంటూ ఉన్నారు. నిన్నటి వరకూ ఈ చార్జీ మొత్తం 32.90 పైసలు! ఇక నుంచి 27.90 పైసలు. 115 రూపాయల లీటర్ పెట్రోల్ ధరలో కేంద్రం తీసుకునే ఎక్సైజ్ డ్యూటీ ఏకంగా మూడో వంతు ఉంది.
ఎప్పుడైతే పెట్రోల్ ధరను రోజువారీగా పెంచడానికి అనుమతులు ఇచ్చారో.. అక్కడ నుంచినే బాదుడు మొదలైంది. రోజుకు పది పైసాలు, పావలా అంటూ ముప్పై ఆరు పైసలంటూ ఏకంగా ఏడాదిన్నర వ్యవధిలో నలభై రూపాయల మేరకు ప్రతి లీటర్ పెట్రోల్ మీదా ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. ఇందులో రాష్ట్రాల వాటా అంటూ.. భక్తులు వాదించవచ్చు. అయితే ప్రస్తుతం పెట్రో ధరల్లో ఎక్సైజ్ డ్యూటీ వాతే చాలా ఎక్కువగా ఉంది.
ఈ మేరకు తమ ఇష్టానుసారం పెంచుకోవడానికి అనుగుణంగా కేంద్రం పార్లమెంట్ లో బిల్లును ప్రవేశ పెట్టి కొన్నాళ్ల కిందట ఆమోదించుకుంది. కరోనా నేపథ్యంలో గత ఏడాది పార్లమెంట్ నిరవధిక వాయిదా పడుతున్న వేళ ఆగమేఘాల మీద ఈ చార్జీలను పెంచుకునే బిల్లును ఆమోదించుకున్నారు. సరిగ్గా గత ఏడాది మార్చి నెల సమయంలో ఆ బిల్లు ఆమోదం పొందినప్పటి నుంచినే పెట్రోల్ ధరలకు పగ్గాలు లేకుండా పోయాయి. సరిగ్గా అప్పటి నుంచి, ఇప్పటి వరకూ పెరిగిన ధర 36 నుంచి 40 రూపాయల వరకూ ఉంది!
మరి కేవలం ఏడాదిన్నర వ్యవధిలో ముప్పై శాతం ధరలను పెంచాకా తాజా ఉప ఎన్నికల ఫలితాలతో కొట్టిన షాక్ తోనో ఏమో.. పెట్రోల్ పై ఐదు రూపాయల మేర, డీజిల్ పై పది రూపాయల మేర డ్యూటీని తగ్గించింది. మరి పెట్రో ఉత్పత్తుల ధరలో సర్ చార్జీలదే కీలక పాత్ర అని అంటే భక్తులు ఒప్పుకోరు. ఇప్పుడు కేంద్రం ఐదు రూపాయల మేర తగ్గించగానే.. చూశారా మోడీ జీని అంటున్నారు.
అయితే పెంచిన 40 రూపాయల్లో ఐదు రూపాయల మొత్తం ఏ మేరకు? సరిగ్గా 2019 వరకూ కూడా వెయ్యి రూపాయలకు పదమూడున్నర లీటర్ పెట్రోల్ లభించేది. ఇప్పుడు అదే వెయ్యి రూపాయలకు ఎనిమిదిన్నర లీటర్ల పెట్రోల్ కూడా రావడం లేదు. ఈ రేంజ్ లో పెంచేశాకా.. ఇప్పుడు వాత పెట్టి వెన్న రాసినట్టుగా ఐదు రూపాయల మేరకు తగ్గించారు. అయితే ఈ తగ్గింపు కేవలం ప్రచారానికే పరిమితం కావొచ్చు.
ఎలాగూ రోజువారీగా పెంచుతారు. రోజుకో 30 పైసాల చొప్పున పెంచుకుంటూ పోయినా, పక్షం రోజుల్లో మళ్లీ ఈ ఐదురూపాయల ధర పెరగనే పెరుగుతుంది. అంతలోపు ప్రజలకు ఏదో ఊరట ఇచ్చినట్టుగా బిల్డప్ కోసం ఈ ప్రకటనలు అంతకు మించి వేరే దృశ్యం లేకపోవచ్చు.