ప్రభుత్వం ప్రకటించే పథకాలేవైనా ప్రజల్లో నమ్మకం కలిగించాలి. అంతే కానీ పథకాల పేరుతో తమని, తమ ఓట్లని కొనేస్తున్నారనే అనుమానం వస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే ఈ విషయం చాలా సార్లు రుజువైంది.
తాజాగా హుజూరాబాద్ ఎన్నికలు దీనికి మరో ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాయి. ఇలాగే జనాల్ని మోసం చేయాలని చూసి 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారు, బాబుని చూసైనా కేసీఆర్ గుణపాఠం నేర్చుకోలేకపోయారు. చివరికిలా ప్రజల చేతిలో పాఠం నేర్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పసుపు – కుంకుమ
2014 ఎన్నికల్లో చంద్రబాబు చాలా హామీలిచ్చారు. కానీ వాటిలో సగం కూడా అమలు చేయలేదు. అమలైన వాటిలో సగం కూడా ప్రజలకి ఉపయోగపడలేదు. తీరా 2019 ఎన్నికలొచ్చే సరికి పాత హామీల్ని గాలికొదిలేసి కొత్త పథకాలపై పడ్డారు.
పసుపు-కుంకుమ పేరుతో మహిళా ఓట్లను హోల్ సేల్ గా కొనేయాలని డిసైడ్ అయ్యారు. ఒక్కో డ్వాక్రా సంఘానికి 10వేల రూపాయల చొప్పున.. మొత్తం 10వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ పథకాన్ని తెరపైకి తెచ్చారు. మిగతా పథకాల డబ్బులన్నీ దీనికే మళ్లించారు.
మహిళలకు డబ్బులిస్తే.. వారి కుటుంబం మొత్తం తనకే ఓటు వేస్తుందనే భ్రమలో పడిపోయారు. కానీ జనం చాలా తెలివిగా ఆలోచించారు. ఎలక్షన్ పథకం టార్గెట్ ఏంటో తెలుసుకున్నారు. కర్రు కాల్చి వాత పెట్టారు.
సామాజిక పింఛన్ పెంపు విషయంలో కూడా బాబు, జగన్ ని చూసి వాతలు పెట్టుకున్నారు. నవరత్నాల్లో భాగంగా పింఛన్ పెంపుపై జగన్ హామీ ఇవ్వగానే, ఇక్కడ.. బాబు హడావిడిగా పింఛన్ పెంచేశారు. కానీ జనం ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కేనని అర్థం చేసుకున్నారు. వైసీపీకి పట్టం కట్టారు.
తెలంగాణలో దళిత బంధు
కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే కేసీఆర్ దళితబంధు ప్రకటించారనే విషయం అందరికీ తెలుసు. అందులోనూ అదే నియోజకవర్గంలో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తామని చెప్పేసరికి అందరికీ ఆ అనుమానం మరింత బలపడింది.
దళితులపై అకస్మాత్తుగా కేసీఆర్ కి పుట్టుకొచ్చిన ప్రేమ ఓట్ల రూపంలోకి మారలేదు సరికదా.. మిగతా వర్గాలన్నీ తమ సంగతేంటని ప్రశ్నించాయి. పోనీ దళితుల ఓట్లయినా గుంపగుత్తగా టీఆర్ఎస్ కి పడ్డాయా అంటే అదీ లేదు. రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయారు కేసీఆర్.
పథకాలతో ప్రజలకు లబ్ధి కలగాలి కానీ, ఎలక్షన్ స్టంట్ అనే అనుమానం వస్తే మొదటికే మోసం వస్తుంది. ఏపీలో చంద్రబాబు మోసపోయినట్టే, తెలంగాణలో కేసీఆర్ కూడా ఎన్నికల స్టంట్ చేస్తూ ఫెయిలయ్యారు.
పథకాల ప్రకటన కేవలం ఎన్నికల్లో గెలవడం వరకే పరిమితం కాకూడదు, గెలిచిన తర్వాత కూడా కొనసాగితేనే నాయకుడిపై జనం నమ్మకం పెంచుకుంటారు. దీనికి ఉదాహరణ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.