జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఇంతకాలం ఇదే కేసీఆర్, టీఆర్ఎస్ నేతలతో రోజా స్నేహసంబంధాలు కొనసాగించారు. ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నాయి.
గతంలో నగరిలో రోజా ఇంటికి సీఎం హోదాలో కేసీఆర్ వెళ్లారు. రోజా ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఆమెను ఆశీర్వదించారు. కేసీఆర్‌ను తన తండ్రిగా రోజా భావిస్తుంటారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో రోజా బహిరంగంగా చెప్పారు. తెలంగాణలో ఆధ్మాత్మిక కార్యక్రమం ఏదైనా కేసీఆర్ వెంట నీడలా నడిచే వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తిరుగుతుంటారనే సంగతి అందరికీ తెలుసు. ఈ ఇద్దరు నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం, బీఆర్ఎస్ను స్థాపించడం , దాన్ని ఏపీలో విస్తరిస్తున్న నేపథ్యంలో రోజా విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు చేయడం గమనార్హం. రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు. ఏపీలో అడుగుపెట్టడం ఎంత వరకు సబబు అని రోజా బీఆర్ఎస్ నేతల్ని ప్రశ్నించారు.
కొత్త రాష్ట్రాన్ని కోరుకునే వారే రాజధాని కట్టుకోవాల్సి వుండిందన్నారు. కానీ హైదరాబాద్‌ను తెలంగాణకు కేటాయించారన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీ నష్టపోయిందన్నారు. ఆ నష్టాన్ని ఇప్పటికీ భర్తీ చేయలేదని ఆమె విమర్శించారు. బీఆర్ఎస్లో చేరే ఏపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.
నిన్నటి వరకూ బీఆర్ఎస్ నేతలతో రాసుకుపూసుకు తిరిగిన రోజా… అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకోవడం ఎందుకనే చర్చకు తెరలేచింది. ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో వున్నారని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో, ఆ ఎఫెక్ట్ రాజకీయంగా తనపై పడుతుందనే భయంతో రోజా ఉద్దేశ పూర్వకంగానే ఇలా మాట్లాడుతున్నారా? అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.