జయం జయం చంద్రన్న అంటూ గతంలో బాబుని ముంచేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ (ఆర్కే) ఈ సారి కూడా అదే పనిలో వున్నాడు. ప్రతి ఆదివారం కొత్త పలుకు రాస్తాడు. తార్కికంగా, హేతుబద్ధంగా తన రాతలు వుంటాయని ఆర్కే నమ్మకం. కానీ అవన్నీ బాబుని పొగిడే చిలక పలుకులే. జగన్‌పై విరుచుకుపడుతూ, గత 40 ఏళ్లుగా చంద్రబాబు వంటి నాయకుడు , దార్శనీకుడూ లేడనే రీతిలో కొత్త పలుకు వుంటుంది. అయితే శైలి , భాష చదివింపజేస్తాయి. ఎంతోకొంత లాజిక్ వుంటుంది కానీ, నిష్పాక్షికత వుండదు. పడిపోయిన బాబుని, జాకీలు పెట్టే లేపే పని ప్రధానంగా వుంటుంది.
ఈ ఆదివారం (డిసెంబర్ 25) కేసీఆర్ గురించి రాస్తూ బాబుని పొగిడిన తీరును చూస్తే టీడీపీకి వేరే శత్రువు అక్కర్లేదనిపిస్తుంది. చంద్రబాబు ఖమ్మం సభతో కేసీఆర్ ఉలిక్కి పడ్డాడట! సభలకి జనం రావడం గతంలో ఎన్టీఆర్, ఇందిరాగాంధీతోనే పోయింది. తర్వాత తోలే సభలే జరుగుతున్నాయి. చిరంజీవి, పవన్‌లాంటి సినిమా నటులు వేరు. వాళ్ల సభలకు జనం వస్తారు కానీ ఓట్లు వేయరు. ఖమ్మం సభతో బాబుకి వచ్చేదీ లేదు. కేసీఆర్‌కి పోయేదీ లేదు. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ అంత్యక్రియలు జరిగి చాలా కాలమైంది. ఆంధ్రాలోనే గోచి దక్కకపోతే బాబుకి తెలంగాణలో ఏం పని? బీజేపీతో పొత్తుకి ఎత్తుగడట! బాబుని కలుపుకుంటే కేసీఆర్ చేతికి మళ్లీ ఆయుధం ఇచ్చినట్టే అని తెలుసుకోలేనంత అమాయకంగా బీజేపీ వుందా? వుందనే ఆర్కే భావన.
బీఆర్ఎస్లో ఉక్కబోతకి గురయ్యే వాళ్లంతా టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారట. ఇదో కామెడీ స్టేట్మెంట్. అధికార పార్టీలో ఇబ్బందులొస్తే అధికారంలోకి వచ్చే పార్టీలోకి చేరుతారు కానీ, ఎప్పటికీ అధికారంలోకి రాని తెలుగుదేశంలో చేరేంత అమాయకంగా రాజకీయ నాయకులున్నారా? వుంటారా? ఖమ్మం సభ చాలా మందిలో ఆశలు చిగురింపజేసిందట! కనీసం పాతిక సీట్లలో టీడీపీ ప్రభావం చూపుతుందట. అందుకే కేసీఆర్ గజగజ వణుకుతున్నారట. ఇలాంటి గాలి కొట్టే వార్తలు రాసి రాసి గతంలో బాబు ట్యూబు పగలగొట్టాడు. ఈ సారి కూడా అదే. నిజానికి జగన్ ఆంధ్రజ్యోతిని తిడుతూ వుంటాడు కానీ, ఆయనకి ఆ పత్రిక వల్ల జరిగే మేలు అంతాఇంతా కాదు.
అభివృద్ధి విషయంలో హైదరాబాద్‌తో చంద్రబాబు పోటీ పడతారట. గత ఐదేళ్లు పాలించినప్పుడు ఏం పోటీ పడ్డాడో అది చెప్పరు.
గతంలో కేసీఆర్ ఆంధ్రా వాళ్లని తిట్టిన మాట నిజమే. ఉద్యమ సమయంలో ఆవేశాలు సహజం. అయితే ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా చూసిన కేసీఆర్ అంటే అందరికీ గౌరవమే. హైదరాబాద్ అభివృద్ధి, శాంతిభద్రతలు ఆయన హయాంలో పక్కాగా ఉన్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో సెటిలర్స్ కేసీఆర్‌కి ఓట్లు వేశారని చెబుతూనే ఆంధ్రా వాళ్లని ఆయన తిట్టాడని గుర్తు చేయడం కొత్త పలుకు తికమక.