ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్పీడ్ లో ఉన్నారు చిరంజీవి. యంగ్ హీరోలతో సమానంగా వరుసపెట్టి సినిమాలు ఎనౌన్స్ చేశారు. ఒకదానితర్వాత ఇంకోటి చకచకా పూర్తిచేసే పనిలో ఉన్నారు. మరి ఇలాంటి టైమ్ లో చిరంజీవి, ప్రత్యేకంగా ఓటీటీ కోసం సినిమా చేస్తే ఎలా ఉంటుంది? కనీసం వెబ్ సిరీస్ లో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఈ రెండు ఆఫర్లు చిరంజీవికి వచ్చాయి. రెండింటినీ ఆయన తిరస్కరించారు.
చిరంజీవితో గంట నిడివితో ఓ సినిమా ప్లాన్ చేసింది బడా ఓటీటీ సంస్థ. చిరంజీవి కుమార్తె సహకారంతో అపాయింట్ మెంట్ తీసుకుంది. మాస్ ఎలిమెంట్స్ తో పాటు సామాజిక సందేశం ఉన్న స్టోరీ అది. జస్ట్ 25 రోజుల కాల్షీట్ కు ఫుల్ పేమెంట్ ఆఫర్ చేసింది. ఖర్చులు, ఇతరత్రా వ్యవహారాలు కూడా భరించడానికి సిద్ధమైంది. కానీ చర్చల తొలి రోజే ఈ ఆఫర్ ను చిరంజీవి రిజెక్ట్ చేశారు.
తర్వాత అదే సంస్థ, తమ వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్ర కోసం చిరంజీవిని సంప్రదించింది. మంచి క్యారెక్టర్ అయినప్పటికీ, ఆ పాత్ర చేయడానికి కూడా చిరంజీవి నిరాకరించారు.
స్టార్ హీరోలెవ్వరూ తమ సినిమాల్ని నేరుగా ఓటీటీకి ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. రీసెంట్ గా తన సినిమాలన్నీ థియేటర్ల కోసమేనంటూ ప్రకటించాడు మహేష్ బాబు. ఇప్పుడు చిరంజీవి కూడా తన తొలి ప్రాధాన్యం బిగ్ స్క్రీన్ కే అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. మరోవైపు నాగార్జున మాత్రం ఓటీటీ డెబ్యూకు రెడీ అవుతున్నారు.