దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాయి. భారతదేశానికి పీడకలగా నిలిచిన సెకెండ్ వేవ్ ఇప్పుడు అత్యంత తక్కువ స్థాయిలో కేసులను నమోదు చేస్తున్నట్టుగా ఉంది.
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 14,313 గా నిలుస్తోంది. గత 224 రోజుల్లో ఇంత తక్కువ స్థాయిలో కేసులు ఎప్పుడూ నమోదు కాలేదు. సెకెండ్ వేవ్ మొదలయ్యాకా కేసుల సంఖ్యలో ఇంత తగ్గుదల నమోదు చేసుకున్నది లేదు.
ఈ ఏడాది మార్చి నెలలో చివరిసారి ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ పోయింది. మార్చి నెలాఖరు నుంచి సెకెండ్ వేవ్ ఊపందుకుంది.
ఏప్రిల్ నెలలో కేసులు విపరీత స్థాయికి చేరాయి. మే నెలలో పతాక స్థాయికి చేరాయి. ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చినా.. రోజువారీ కేసుల సంఖ్య మాత్రం చెప్పుకోదగిన రీతిలో నమోదవుతూనే ఉంది. జూలై నెలాఖరుకే సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా.. ఆ తర్వాత రోజువారీ కేసుల సంఖ్యలో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే వచ్చాయి.
ఆగస్టు నెలలో మళ్లీ స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. ఆ సమయంలోనే కేరళలో రికార్డు స్థాయి కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అక్కడ కూడా రోజువారీ కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంటోంది. గత ఇరవై నాలుగు గంటల్లో వచ్చిన 14 వేల కేసుల్లో కేరళదే ఎక్కువ వాటా. దాదాపు 50 శాతం కేసులు కేరళలోనే వచ్చాయి గత 24 గంటల్లో కూడా. మిగిలిన దేశమంతా కలిసి ఏడు వేల కేసుల వరకూ వచ్చాయి.
ఇక యాక్టివ్ కేసుల లోడు కూడా రెండు లక్షల స్థాయిలో ఉంది. ఏతావాతా.. అక్టోబర్ లో మూడో వేవ్ ఉంటుందన్న అంచనాలకు భిన్నంగా రోజువారీ కేసుల సంఖ్యలో బాగా తగ్గుదల చోటు చేసుకోవడం ఊరటను ఇచ్చే అంశం దేశానికి.