అసలు ఈ రెండిటికీ ఏమైనా సంబంధం ఉందని అనుకుంటున్నారా.. ? అవును, ఆ సంబంధాన్నే వెదికి పట్టుకొచ్చింది టీడీపీ. గతంలో కోడి కత్తి వ్యవహారంలో జగన్ పై దాడి చేసింది టీడీపీ సానుభూతి పరుడా, వైసీపీ అనుచరుడా అనేది పెద్ద డిస్కషన్ పాయింట్.
సోషల్ మీడియాలో వాడు మీవాడే, కాదు మీవాడేనంటూ రెండు పార్టీలు దుమ్మెత్తిపోసుకున్నాయి. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే వచ్చింది. జగనన్న కాలనీల్లో ఇచ్చే ఇంటి స్థలం సరిపోదంటూ కోర్టుకెక్కిన శివమురళి అనే వ్యక్తి టీడీపీ సానుభూతిపరుడని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, అతను వైసీపీకి చెందిన వ్యక్తేనని టీడీపీ విమర్శిస్తోంది.
వైసీపీకేంటి లాభం..?
కోర్టు అడ్డుకట్ట వేయడంతో వైసీపీ పరువుపోయిందని ఓవైపు టీడీపీ ప్రచారం చేస్తోంది. అలాంటి పరువు తక్కువ పని తనకు తానే ఎందుకు చేస్తుంది? టీడీపీ లాజిక్ ఏంటంటే.. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం భారంగా మారి ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందట.
ఆ ఇబ్బందుల్ని అధిగమించాలంటే ఇలా కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవాలని ఆలోచించిందట. అందుకే వైసీపీ సానుభూతి పరుడు శివమురళితో స్థలాల విస్తీర్ణం సరిపోవడం లేదంటూ కోర్టులో కేసు వేయించారని టీడీపీ నేతలంటున్నారు.
మరి ఈ వంకర మాటలెందుకు..?
పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధుల్ని రాష్ట్రం స్వాహా చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కోర్టు తీర్పుతో బుద్ధి తెచ్చుకుని గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాన్ని పేదలకు ఇవ్వాలని, అందులో ఇళ్లు కట్టుకునేలా సహకరించాలని అంటున్నారు చంద్రబాబు.
ఓవైపు స్థలాల విస్తీర్ణం పెంచాలంటూ తీర్మానాలు చేస్తున్న టీడీపీ, మరోవైపు అదే సమస్యపై వైసీపీ కోర్టుకెక్కిందని, స్టే తెచ్చుకుందని ఎలా అనగలుగుతున్నారు. ఇలాంటి డబుల్ గేమ్స్ ని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే చాలా చూశారు.
ఇప్పుడు కొత్తగా ప్రభుత్వమే కేసులు వేయించి, ఆ తప్పంతా టీడీపీపై నెడుతోందని మరో గేమ్ మొదలు పెట్టారు బాబు. వాస్తవానికి ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న తీర్పులన్నిటిపై ప్రజల్లో ఓ నిశ్చితాభిప్రాయం ఉంది. వాటి సారాంశం ఎలా ఉన్నా.. కోర్టు కేసులతో వైసీపీ ఇబ్బంది పడుతోంది, టీడీపీ పండగ చేసుకుంటోంది.
జగనన్న కాలనీల విషయంలో వచ్చిన తీర్పుతో, ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని టీడీపీ రాక్షసానందాన్ని పొందుతోంది. ఇలాంటివాటన్నిటికీ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మరింత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.