బొత్స ఫ్యామిలీకి బంపర్ ఆఫర్…?

విజయనగరం జిల్లా అంటేనే బొత్స సత్యనారాయణ అన్నట్లుగా చేసుకుని రాజకీయం చేస్తున్నారు సీనియర్ మంత్రి. ఆయన ఫ్యామిలీకి జిల్లాలో ఎన్ని పదవులు ఉన్నాయి అంటే చెప్పడం కష్టమే. ఇక పార్టీపరంగా కూడా ఎన్నో పదవులు…

విజయనగరం జిల్లా అంటేనే బొత్స సత్యనారాయణ అన్నట్లుగా చేసుకుని రాజకీయం చేస్తున్నారు సీనియర్ మంత్రి. ఆయన ఫ్యామిలీకి జిల్లాలో ఎన్ని పదవులు ఉన్నాయి అంటే చెప్పడం కష్టమే. ఇక పార్టీపరంగా కూడా ఎన్నో పదవులు ఆ కుటుంబానికే దక్కాయి.

ఇవి కాకుండా మరో బంపర్ ఆఫర్ బొత్స ఫ్యామిలీకే తగిలింది అంటున్నారు. అదెలా అంటే విజయనగరం జెడ్పీ చైర్మన్ పదవిని బొత్స బంధువు మజ్జి శ్రీనివాసరావుకు ఇవ్వడానికి వైసీపీ అధినాయకత్వం పచ్చ జెండా ఊపిందని తాజాగా ప్రచారం సాగుతోంది.

విజయనగరం జిల్లాలో మజ్జి శ్రీనివాసరావు వైసీపీలో కీలకనేతగా ఉన్నారు. ఆయన పార్టీని పటిష్టం చేయడంతో పాటు ప్రజలకు, నేతలకు సన్నిహితుడుగా ఉంటూ వచ్చారు. ఇక వైసీపీ అధినాయకత్వాన్ని కూడా ఆయన బాగానే  మెప్పించారు. అయితే ఇంతవరకూ అధికారిక పదవి అయితే ఆయనకు దక్కలేదు.

ఇపుడు జిల్లా పరిషత్తులకు పట్టిన రాజకీయ  గ్రహణం వీడడంతో ఆయనకు కూడా అందలం దక్కనుంది అంటున్నారు. విజయనగరం జిల్లాలో బీసీలకు కేటాయించిన ఈ కీలకమైన పదవిలో మజ్జి కూర్చోబోతున్నారు అన్నది లేటేస్ట్ టాక్. అన్నీ అనుకూలిస్తే ఆయనే కొత్త జెడ్పీ చైర్మన్ అని వైసీపీలో గట్టిగా వినిపిస్తున్న మాట. చూడాలి మరి.