విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ.. వీళ్లిద్దరికీ పడటం లేదు.. అనేది చాన్నాళ్లుగా క్రికెట్ ఫ్యాన్స్ లో వినిపిస్తున్న మాట. అయితే జట్టు విజయాల నేపథ్యంలో.. వీరి మధ్య ఏం జరుగుతోందనేది అప్పుడప్పుడు మాత్రమే చర్చలోకి వస్తోంది. ఇన్ స్టాగ్రమ్ లో అన్ ఫాలో వరకూ వెళ్లిన వీరి వ్యవహారం ఆ తర్వాత సద్దుమణిగింది. కొహ్లీ, రోహిత్ లకూ అంతర్గతంగా ఏం విబేధాలున్నా.. జట్టు జయాపజయాలను అవి ప్రభావితం చేయకపోవడంతో అదంత సీరియస్ వ్యవహారం గా లేకుండా పోయింది.
అయితే.. తన అభిప్రాయాలను వ్యక్తీకరించే సమయాల్లో, కెప్టెన్ గా తన అథారిటీని చలాయించే సమాయాల్లో రోహిత్ అవకాశాలను కొహ్లీ దెబ్బతీయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదని స్పష్టం అవుతోంది. ఈ క్రమంలోనే రకరకాల అంశాలు వార్తల్లోకి వస్తున్నాయి. ఇందులో ఒకటి.. రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ వద్దని కొహ్లీ డిమాండ్ చేశాడనేది. వచ్చే టీ20 ప్రపంచకప్ కు కూడా రోహిత్ వైస్ కెప్టెన్ గా వద్దంటూ కొహ్లీ సెలెక్టర్లపై ఒత్తిడి తీసుకు వచ్చాడనే విషయం బయటపడుతూ ఉంది.
వయసులో తనకన్నా పెద్దవాడైన రోహిత్ తనకు వైస్ కెప్టెన్ గా ఉండటం ఏమిటి? అనేది రోహిత్ వేసిన ప్రశ్న. అయితే.. కెప్టెన్సీకీ వయసుకు సంబంధం లేదేమో! గతంలో చాలా మంది సీనియర్లు తమ కన్నా జూనియర్ల కెప్టెన్సీలో ఆడారు. సచిన్, గంగూలీ, కుంబ్లే, లక్ష్మణ్, ద్రావిడ్ వంటి వాళ్లు ధోనీ చెప్పింది చేశారు! అలాంటప్పుడు.. కొహ్లీ కెప్టెన్ గా ఉంటే, రోహిత్ వైస్ కెప్టెన్ గా ఉండటం విడ్డూరం ఏమీ కాదు.
అయితే ఆ ఛాన్స్ ను పంత్, కేఎల్ రాహుల్ లాంటి వాళ్లకు ఇవ్వాలంటూ ఇటీవల కొహ్లీ వాదించాడట. కానీ, పంత్, రాహుల్ లు ఇంకా అభిమానులకు పూర్తి స్థాయిలో భరోసాను ఇవ్వలేదు! వాళ్లిద్దరి విషయంలో అంతా బాగానే ఉన్నా.. ఇంకా ఏదో పరిణతి కావాలని స్పష్టం అవుతూనే ఉంది. ఆ పరిణతి పూర్తిగా సాధించిన ఆటగాడు రోహిత్.
నిజానికి కొహ్లీని పూర్తిగా కెప్టెన్సీ నుంచి పీకేసి రోహిత్ కు ఆ బాధ్యతలు అప్పగించాలనే టీమిండియా అభిమానులు కోకొల్లలు. అలాంటిది కనీసం రోహిత్ కు వైస్ కెప్టెన్సీని కూడా దక్కనీయకూడదని కొహ్లీ వాదించాడనే మాట వారిని దిగ్భ్రమకు గురి చేసేదే. అయితే కొహ్లీ డిమాండ్ కు సెలెక్టర్లు తలొగ్గలేదని స్పష్టం అయ్యింది.
చివరకు టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తను తప్పుకుంటానంటూ కొహ్లీ ప్రకటించేశాడు. దీంతో ఆ అవకాశం సహజంగానే రోహిత్ కు దక్కవచ్చు. అప్పుడు ఎంచక్కా ఏ పంత్ కో, రాహుల్ కో వైస్ కెప్టెన్సీ దక్కవచ్చని.. ఇలా అయినా కొహ్లీ కోరిక నెరవేరడం ఖాయమని స్పష్టం అవుతోంది!