రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగైంది. వైద్యులు ఈరోజు సాయిధరమ్ తేజ్ కు పెట్టిన వెంటిలేటర్ ను తొలిగించారు. తనకుతానుగా శ్వాస తీసుకుంటున్నాడు సాయితేజ్.
అయితే డిశ్చార్జ్ కు సంబంధించి మాత్రం వైద్యులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరికొన్ని రోజుల పాటు ఆయన హాస్పిటల్ లోనే వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతారని మాత్రం తెలిపారు. యాక్సిడెంట్ వల్ల సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ విరిగింది. దానికి సర్జరీ చేశారు వైద్యులు. ఆ శస్త్రచికిత్స నుంచి కూడా కోలుకున్న తర్వాత తేజ్ ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం సాయితేజ్ హాస్పిటల్ లో వేగంగా కోలుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. మెగా హీరోలంతా ఇప్పటికే సాయితేజ్ ను ఓసారి పరామర్శించారు. తాజాగా 2 రోజుల కిందట బన్నీ కూడా సాయిని పలకరించాడు.
వినాయక చవితి రోజున తన స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తూ, హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ పై జారిపడ్డాడు సాయితేజ్. ఓ వాహనాన్ని తప్పించబోయి, ఇసుకలో బండి జారడం వల్ల యాక్సిడెంట్ కు గురయ్యాడు. వెంటనే అతడ్ని మెడికవర్ హాస్పిటల్ కు తరలించారు.
ప్రాధమిక చికిత్స అనంతరం అపోలో హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సాయి ధరమ్ తేజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.