ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆరు నెలలు ముందూవెనుకా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో నాయకులు అటూఇటూ పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. టికెట్ రాదనే అనుమానం ఉన్న వాళ్లు, ఇస్తామని భరోసా ఇచ్చిన పార్టీలో చేరేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంపై టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడులో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల మాట్లాడుతూ పార్టీ మార్పుపై సాగుతున్న ప్రచారానికి తెరదించారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి టీఆర్ఎస్లో తుమ్మల ఇబ్బంది పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తన ఓటమికి సొంత పార్టీ వాళ్లే కారణమని గతంలో ఆయన నేరుగా విమర్శలు చేశారు. అలాగే మంత్రి పువ్వాడ అజయ్‌తో కూడా ఆయనకు విభేదాలున్నాయి.
ఇటీవల తన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్యను దారుణంగా చంపినప్పటికీ, నిందితులను శిక్షించడంలో అధికార పార్టీ సహకరించలేదనే ఆవేదన ఆయనలో ఉంది. అనుచరుడి హత్యలో ప్రధాన నిందితులు సీపీఎం నేతలు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాల సాయాన్ని టీఆర్ఎస్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ కారణంగానే హత్య కేసును నీరుగార్చారనే ఆవేదనను సన్నిహితుల వద్ద తుమ్మల వ్యక్తం చేయడం తెలిసిందే. ఇలా అనేక కారణాలతో తుమ్మల ప్రత్యామ్నాయ పార్టీని చూసుకుంటారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఖండించడం గమనార్హం.
చివరి వరకూ తన మిత్రుడైన కేసీఆర్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమన్నారు. అనుచరుల అభిమానం తోడుంటే కొండలనైనా పిండిచేస్తానని ధీమాగా చెప్పారు. ఆత్మీయ సమ్మేళనంపై బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడానికి ఏమీ లేదన్నారు. బీజేపీ కండువా కప్పుకుంటాననే వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.