విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం మరింత జోరు అందుకుంది అనిపిస్తోంది. ఒక వైపు కార్మిక లోకం మహా పాదయాత్రలు, మానవ హారాలతో హోరెత్తిస్తున్నా కూడా కేంద్రానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. తన పనిని తాను చాప కింద నీరులా చకచకా చేసుకుని పోతోంది.
ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ కొత్త సీఎండీగా అతుల్ భట్ ని నియమించారు. ఆయన తాజాగా బాధ్యతలు చేపట్టారు. ఇంతకీ అతుల్ భట్ గొప్పతనం ఏంటి అంటే ఆయనకు అనేక కంపెనీలను విలీనం చేయడంలోనూ టేకోవర్ చేయడంలోనూ విశేష అనుభవం ఉందిట.
ఆయన ఈ విషయాల్లో మంచి వ్యూహకర్త అని కూడా చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్న కేంద్రానికి ఈయన అవసరం బాగానే పడిందని అందుకే ఆయన్ని అర్జంటుగా సీఎండీ పదవిలో కూర్చోబెట్టారు అని అంటున్నారు.
ఇక 2024 నవంబర్ వరకూ ఈయన పదవీ కాలం ఉంటుంది. దాంతో స్టీల్ ప్లాంట్ కధకు శుభం కార్డు వేసే ఘనమైన పనిని అతుల్ భట్ నిర్వహిస్తారా అన్న డౌట్లు అయితే ఉక్కు కార్మిక లోకానికి ఒక్క లెక్కన వచ్చేస్తున్నాయి. చూడాలి మరి అతుల్ భట్ రూట్ ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ఫేట్ ని మార్చుతుందో.