టీడీపీలో తెల్ల ఏనుగుల్ని పక్కనపెట్టే క్రమంలో చంద్రబాబు వడివడిగా అడుగులు ముందుకేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని సీనియర్లను, కేవలం నామినేటెడ్ పదవులతోనే నెట్టుకొస్తున్న నేతల్ని ఆయన వడపోస్తున్నారు.
ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డిని బాబు పూర్తిగా పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. పార్టీలో ఆయన పోలిట్ బ్యూరో మెంబర్. కానీ ఏనాడూ హడావిడి కనిపించదు. ఇటీవల కాలంలో టీడీపీ తరపున చాలామంది సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. వైరి పక్షాలను అటాక్ చేస్తున్నారు.
ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా నేరుగా పార్టీ తరపున జూమ్ మీటింగ్ పెట్టి దులిపేస్తున్నారు. నిజమా, కాదా అనే విషయాన్ని పక్కనపెడితే ముందు వైసీపీపై బురదజల్లడమే వీరి పని. ఇలాంటి వారినే ఇప్పుడు బాబు బాగా దగ్గరకు తీస్తున్నారు. ఆ లెక్కలో చూసుకుంటే సోమిరెడ్డిలాంటి వాళ్లు టీడీపీకి భారమనే చెప్పుకోవాలి.
సోమిరెడ్డి చేసిన తప్పు ఇదే..!
వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్న సోమిరెడ్డి 2014 ఎన్నికల్లో కూడా గెలవలేకపోవడంతో చంద్రబాబు, ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రి పదవి ఇచ్చారు, ఆయన సీనియార్టీని గౌరవించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి అనుభవించిన సోమిరెడ్డి.. ఇప్పుడు అధికారం పోవడంతో పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు.
కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారు. రాష్ట్ర స్థాయి నేతల్లాగా రాష్ట్ర సమస్యలపై ఆయన ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టలేదు. కేవలం తన నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డితో ఫైట్ చేయడంతోనే ఆయన సరిపెట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో జిల్లాకే చెందిన వైసీపీ యువనేతతో ఆయన లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఈ బంధాలన్నీ బయటపడటంతోనే చంద్రబాబు సోమిరెడ్డి స్పీడ్ కి బ్రేకులు వేశారని, ఆయన ప్రయారిటీ తగ్గిందని అనుకుంటున్నారు.
తనకు ప్రాధాన్యం తగ్గిపోతుందన్న అనుమానంతోనే సోమిరెడ్డి ఇటీవల వ్యవసాయ శాఖను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ ఓ జూమ్ మీట్ పెట్టారు. అయితే ఈ రిపేర్ వర్క్ లేవీ బాబు దగ్గర పనిచేయలేదట. లోకేష్ కోసం ఆయన పూర్తిగా కొత్త టీమ్ ని సిద్దం చేస్తున్నారట. అందులో సోమిరెడ్డి లాంటి వారికి స్థానం లేకుండా.. పార్టీకి ఉపయోపగడేవారికే ఛాన్స్ ఇస్తామని చెబుతున్నారట. సో.. తెల్లఏనుగులను తెలివిగా బయటకు పంపించే పని టీడీపీలో మొదలైందనే చెప్పాలి.