cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

అంపశయ్యపై స్టార్ హీరోల భవిష్యత్తు

అంపశయ్యపై స్టార్ హీరోల భవిష్యత్తు

కురుక్షేత్రంలో కర్ణుడి రథచక్రం గోతిలో ఇరుక్కుంటే తానే కిందకు దిగి పైకి లాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కర్ణుడి చివరి ఘడియల్లోని మోస్ట్ పాపులర్ ఘట్టం. 

తెలుస్తోందో లేదో కానీ మన స్టార్ హీరోల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉందిప్పుడు. గోతిలో పడ్డ వారి స్టార్డం ని వాళ్లే పైకి లాక్కోవాలి. ప్రజలు, ప్రభుత్వాలు చేతులు దులుపుకుని పక్కన నిలబడ్డారు. సాయం చేసే ఆలోచన ఎవ్వరికీ లేదు. 

వివరాల్లోకి వెళ్దాం. 

కరోనా మొదటి వేవ్ తర్వాతికన్నా రెండో వేవ్ తర్వాత థియేటర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. సినిమా బాగుందన్నా హాలుకు జనాలు రావట్లేదు. 

సీటీమార్ ఈ స్తబ్తతకి చరమగీతం పాడుతుందనుకుంటే అది కూడా నాలుగడుగులేసి అలసిపోయి చతికిలపడింది. మాస్ హిట్ అనే టాక్ వచ్చినా ఈ సినిమా బ్రేకీవెన్ కి దూరంగా ఉందని ట్రేడ్ టాక్. 

ఎందుకంటే సాధారణంగా ఇలాంటి సినిమాలని తొలి రెండ్రోజులు రెగ్యులర్ సినిమా ప్రేమికులు, మాస్ జనాలు చూసేసాక ఫ్యామిలీ ఆడియన్స్ బయటికొస్తారు. ఇప్పుడు ఆ ఆడియన్సే బయటికి రావడంలేదు. టీవీల్లో వస్తే చూద్దాంలే అనో, ఓటీటీలోకి ఎలాగూ వస్తుంది కదా అనే ఆలోచనతోనో ఇళ్లకే పరిమితమవుతున్నారు. 

"సీటీమార్" పరిస్థితి ఇలా ఉంటే "తలైవి" పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సినిమా బాగుందన్నా ప్రేక్షకులు హాలుకి రావట్లేదు. ఆఖరికి తమిళనాడులో కూడా ఈ సినిమా విషయంలో సరిపడా జనం థియేటర్స్ కి రాకుండా మొహం చాటేయడం ఎవ్వరూ ఊహించని విషయం. 

పోనీ జనం భయపడి రావడంలేదా అంటే..అది నిజం కాదు...ఎందుకంటే మాల్స్ లోనూ, పెళ్లిళ్లలోనూ సకుటుంబ సపరివార సమేతంగా జనం బయట తిరుగుతున్నారు. ఒక్క సినిమా హాల్సుకే రావట్లేదు. దీనిని బట్టి ఏమర్థమవుతోంది? మెజారిటీ ప్రేక్షకులు సినిమాలని హోం వ్యూవింగ్ కి ఫిక్స్ అయిపోయారని. 

ఇప్పుడు అసలు కథలోకొద్దాం. 

నటులు స్టార్స్ అయ్యేది కేవలం థియేటర్స్ వల్లనే. 

ప్రతి ఇంట్లోనూ దైవ మందిరం ఉంటుంది. అక్కడ కలిగే భక్తికి, గుడికెళ్లినప్పుడు కలిగే భక్తికి తేడా ఉంటుంది. గుడిలో యాంబియన్స్, ఆ వాతావరణం గర్భగుడిలో ఉన్న దేవుడి మీద భక్తి పెరిగేలా చేస్తుంది. ఇంట్లో సినిమాకి, థియేటర్లో సినిమాకి తేడా ఇదే. ఇది కాదనడానికి లేదు. ఎందుకంటే నేరుగా టీవీల్లో కనిపించే టీవీ సీరియల్స్ లో నటించే నటీనటుల్లో స్టార్డం ఉన్నవాళ్లు ఎవ్వరూ లేరు. 

థియేటర్స్ లేకపోతే కటవుట్స్ ఉండవు. తొలి ఆటకి బాజా బజంత్రీలుండవు. టికెట్స్ కోసం క్యూలుండవు. ఫ్యాన్స్ న్యూస్ పేపర్స్ చింపి హాల్లో ఎగరేయడాలుండవు. ఈలలుండవు, అరుపులుండవు. భారీ సౌండ్, భారీ బొమ్మ ఉండవు. ఇవేవీ లేకపోతే స్టార్డం ఉండదు. అది లేకపోతే మార్కెట్ ఉండదు. ఫలితంగా భారీ రెమ్యునరేషన్స్ ఉండవు. 

అంటే సినిమా నటులకి, సీరియల్స్ నటులకి, ఓటీటీ నటులకి తేడాలుండవు. అందరూ కేవలం నటులంతే. నో మోర్ స్టార్స్. 

ఈ పరిస్థితి దాపురిస్తే ప్రస్తుతం స్టార్స్ గా చెలామణీ అవుతూ కోట్లు సంపాదించి కోటల్లో నివసిస్తున్న నటుల మాటేమిటి? 

వెండితెరమీద వెలిగినంత తేలిక కాదు ఇంటి తెర మీద వెలిగి మనసుల్ని దోచుకోవడం. అసమాన ప్రతిభ ఉంటే తప్ప ఇంటితెరమీద నటుడిగా మెరిసి మెప్పించడం కష్టం. ఎందుకంటే వెండితెరమీదున్న అటెన్షన్ ఇంట్లోని టీవీలకి, అరచేతిలోని మొబైల్ కి ఉండదు. 

విశాలమైన ఏసీ హాల్లో కుర్చీలకి అతుక్కుపోయి ఈలలు, గోలల మధ్య చిమ్మ చీకట్లో తెర మీద చూస్తున్నప్పుడు అంతెత్తున కనిపించే హీరో ఎక్కడ? 

ఇంట్లో టేబుల్ మీద అన్నం తింటున్నప్పుడో, అంట్లు తోముకుంటున్నప్పుడో టీవీలో కనిపించే హీరొ ఎక్కడ?

బాత్రూములో కమోడ్ మీద కూర్చుని పని కానిస్తున్నప్పుడు మొబైల్లో కనిపించే హీరో ఎక్కడ?

నేరుగా ఓటీటీలో విదుదలైన కొత్త చిత్రం "టక్ జగదీష్" విషయానికే వద్దాం. అమేజాన్ ప్రైం వీడియోలో విడులైపోయాక సమీక్ష తర్వాత ఇక ఆ సినిమా బిజినెస్ గురించి రాయడానికి, మాట్లాడుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. ఇదే థియేటర్లో రిలీజైతే కలెక్షన్స్ గురించి చర్చించుకోవడం, హీరో మార్కెట్ గురించి అంచనాలు వేయడం జరుగేది. ప్రతి సినిమాకి ఇలాగే జరిగితే ఇక ఏ హీరో మార్కెట్ గురించి టాపిక్ ఉండదు. 

కరోనా కాలం కొంత, ఆ.ప్ర ప్రభుత్వం థియేటర్స్ కి టికెట్ల్స్ అమ్మకం విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా టైట్ చేయడం అనే కారణం వల్ల ఇంకొంత స్టార్ హీరోల రథచక్రాలు గోతుల్లో పడ్డాయి. వాటిని లేవదీసుకోవాల్సిన అవసరం వారికే అందరికన్నా ఎక్కువగా ఉంది. 

రూ. 50 కోట్లు పుచ్చుకునే పెద్ద హీరో సినిమాకి పనిచేసినా, రూ 10 లక్షలు తీసుకునే ఒక సాధారణ హీరో సినిమాకి పని చేసినా సినీ కార్మికులకి ముట్టేదాంట్లో పెద్ద తేడా ఉండదు. కనుక థియేటర్స్ కోసం సినిమాలు తీసినా, ఓటీటీల కోసం తీసినా వీరి బతుకులేమీ మారవు. కాబట్టి దిగబడ్డ రథ చక్రాన్ని చూసి బాధ పడాల్సిన అవసరం వీళ్లకి లేదు. కనుక థియేటర్ వ్యవస్థని స్టార్ హీరోలే వారి భవిష్యత్తు కోసం కాపాడుకోవాలి. 

శ్రీనివాస మూర్తి

లవ్ స్టొరీ లకు ఇక గుడ్ బై

వైఎస్సార్ కారు నడిపాను

 


×