క‌రోనా వీక్లీ రిపోర్ట్ ఏం చెబుతోందంటే!

గ‌త వారం రోజుల వ్య‌వ‌ధిలో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య‌లో స్వ‌ల్ప త‌గ్గుద‌ల చోటు చేసుకుంది. ఆగ‌స్టు నెలాఖ‌రు నుంచినే మూడో వేవ్ ఉంటుంద‌న్న ఊహాగానాల‌కు భిన్నంగా సాగుతోంది క‌రోనా ప్ర‌వ‌ర్త‌న‌.  సెప్టెంబ‌ర్ రెండో వారంలో…

గ‌త వారం రోజుల వ్య‌వ‌ధిలో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య‌లో స్వ‌ల్ప త‌గ్గుద‌ల చోటు చేసుకుంది. ఆగ‌స్టు నెలాఖ‌రు నుంచినే మూడో వేవ్ ఉంటుంద‌న్న ఊహాగానాల‌కు భిన్నంగా సాగుతోంది క‌రోనా ప్ర‌వ‌ర్త‌న‌.  సెప్టెంబ‌ర్ రెండో వారంలో కూడా క‌రోనా ఒకింత నియంత్ర‌ణ‌లోనే ఉంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం త‌గ్గుద‌ల చోటు చేసుకోలేదు. వారం రోజుల వ్య‌వ‌ధిలో దేశంలో సుమారుగా రెండున్న‌ర ల‌క్ష‌ల కేసులు న‌మోద‌య్యాయి.  

సెప్టెంబ‌ర్ తొలి వారంలో న‌మోదైన కేసుల సంఖ్య సుమారు 2.8 ల‌క్ష‌లు. గ‌త వారంలో సుమారు ముప్పై వేల స్థాయిలో కేసుల సంఖ్య త‌గ్గింది. ఇలా స్వ‌ల్ప త‌గ్గుద‌ల న‌మోదైంది. అలాగే క‌రోనా కార‌ణ మ‌రణాల సంఖ్య త‌గ్గుద‌ల‌లో కూడా గ‌త వారం మెరుగైన స్థితిలో నిలిచింది. 

వారం రోజుల వ్య‌వ‌ధిలో దేశంలో సుమారు 2,104 మంది మ‌ర‌ణించిన‌ట్టుగా ప్ర‌భుత్వ గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఈ నంబ‌ర్ గ‌త 24 వారాల్లోనే అతి త‌క్కువ స్థాయిలో న‌మోదైంది. మార్చి 22-28 ల ద‌గ్గ‌ర నుంచి ఈ నంబ‌ర్లు పెరుగుతూ వెళ్ల‌గా, ప్ర‌స్తుతం ఆరు నెల‌ల త‌క్కువ స్థాయిలో న‌మోదైంది. 

ఇక గ‌త వారంలో మెజారిటీ కేసుల వాటా కేర‌ళ‌దే. దేశం మొత్తం మీద వ‌చ్చిన రెండున్న‌ర ల‌క్ష‌ల కేసుల్లో 1.6 ల‌క్ష‌ల కేసులు కేర‌ళ‌లోనే న‌మోద‌య్యాయి. ఇలా 66.6 శాతం వాటా కేర‌ళ‌నే ద‌క్కించుకుంది. బ‌క్రీద్, ఓనం పండుగ‌ల త‌ర్వాత కేర‌ళ‌లో పెరుగుతూ వ‌చ్చాయి కేసులు. అయితే కేర‌ళ‌లో కూడా గ‌త‌వారంలో కొంత క్షీణ‌త చోటు చేసుకుంది. అంత‌కు ముందు వారంతో పోలిస్తే కేర‌ళ‌లో కూడా కేసుల సంఖ్య 17 శాతం వ‌ర‌కూ త‌గ్గ‌డం ఊర‌ట‌. 

ఇక ఈ వారంలోనే దేశ వ్యాప్తంగా వినాయ‌క‌చ‌వితి సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి. ప్ర‌జ‌లు మార్కెట్లలో విప‌రీతంగా క‌నిపించారు. మాస్కులు వాడ‌కం ప‌రిమిత స్థాయిలోనే జ‌రిగింది. అలాగే చాలా రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు విధించినా అమ‌లు అంతంత మాత్ర‌మే. మూడో రోజున నిన్న చాలా చోట్ల వినాయ‌క నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా జ‌రిగాయి.  

భౌతిక దూరం, మాస్కుల ఊసే లేదు. మ‌రి ఈ ప్ర‌భావం రానున్న వారాల్లో కేసుల సంఖ్య‌పై ప‌డుతుందా? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ఒక‌వేళ రానున్న రెండు వారాల్లో కొత్త కేసుల సంఖ్య‌లో పెరుగుద‌ల న‌మోదు కాక‌పోతే.. క‌రోనా ప్ర‌భావం గురించి అంచ‌నాల‌ను తిరిగి లెక్క‌గ‌ట్టాల్సిందే ప‌రిశోధ‌కులు కూడా!